ముందస్తుకే మొగ్గు.. రాష్ట్రంలో మొదలైన ఎన్నికల హడావిడి!!

by Disha Web Desk 2 |
ముందస్తుకే మొగ్గు.. రాష్ట్రంలో మొదలైన ఎన్నికల హడావిడి!!
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో పరిణామాలు గమనిస్తున్న వారు ఎవరైనా ఎన్నికల హడావిడి రెండేళ్ల ముందే మొదలైపోయింది అని అనుకోవాల్సిందే. సాధారణంగా ఎన్నికలకు ముందు జనాల్లోకి వెళ్లే పని విపక్షాలు చేపడతాయి. కానీ, రాష్ట్రంలో మాత్రం అధికార పక్షం మొదలుపెట్టింది. ఎన్నికలు బాగా దగ్గరపడ్డాక మాత్రమే పార్టీ ముందుకొచ్చి ప్రభుత్వం వెనక్కు వెళుతుంది. ఇది రాజకీయాల్లో సహజంగా జరిగే ప్రక్రియ. అంతవరకూ మాత్రం ప్రభుత్వ వ్యవహారాల్లో మంత్రులదే పైచేయి. కానీ రెండు రోజుల క్రితం జరిగిన పార్టీ కీలక సమావేశంలో మంత్రుల కంటే జిల్లా అధ్యక్షులు, కో-ఆర్డినేటర్‌లే ప్రధానం అని వారి ముందే మంత్రులకు చెప్పడంతో ఎన్నికల హడావుడి‌కి పార్టీ అధ్యక్షుడు జగన్ తెరతీశారు. రానున్న ఎన్నికలకు ఆ విధంగా ఆయన రోడ్ మ్యాప్ ఇచ్చేసినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేలకు గ్రాఫ్ సరిగా లేదన్న సీఎం

సీఎంగా తనకు 65 శాతం గ్రాఫ్ ఉందన్న ముఖ్యమంత్రి మంత్రులు, ఎమ్మెల్యేలలో చాలా మందికి 45 శాతం కంటే తక్కువ గ్రాఫ్ ఉందని అన్నారు. సరిగ్గా గ్రాఫ్ పెంచుకోకుంటే వచ్చే ఎన్నికల్లో సీట్ ఇవ్వడం కుదరదన్న ఆయన ఎమ్మెల్యేలు ఇకపై గడపగడపకూ వెళ్లాల్సిందే అని సూచించారు. మే నెల నుంచి గేర్ మారుస్తున్నామన్న ఆయన 175 సీట్లనూ గెలుచుకునేలా పార్టీ అంతా కష్టపడాలి అంటూ అల్టిమేటం ఇచ్చేశారు. సీఎం కూడా ఇకపై అన్ని జిల్లాలు పర్యటించడానికి రెడీ అవుతున్నారు.

ముందస్తు ఆలోచనలో పార్టీ

పైకి ఎన్నిచెప్పినా ఏ ప్రభుత్వానికైనా వ్యతిరేకత అనేది తప్పదు. అయితే అది రాష్ట్రంలో కాస్త ఎక్కువగానే పెరుగుతున్నదనే విశ్లేషణలు మొదలైపోయాయి. వరుసగా పెరిగిపోతున్న చార్జీలూ, పన్నులూ, కరెంట్ కోతలూ, సంక్షేమ పథకాల్లో ఆంక్షలూ, హద్దే లేకుండా పెరిగిపోతున్న అప్పులూ ఇవన్నీ ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలు కావడానికి కారణం అని ఎనలిస్టులూ, మాజీ ఉన్నతాధికారులూ చెబుతూ వస్తున్నారు. ఈ వ్యతిరేకత మరింత ముదరక ముందే ఎన్నికలకు వెళితే ఫలితం ఉంటుందని వైసీపీ అధినేత భావిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.

యాక్టివ్ అయిన విపక్షాలు

గతంతో పోలిస్తే ఏపీలోని విపక్షాలు జోరు పెంచుతున్నాయి. అటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ దొరికిన ఏ అవకాశాన్నీ వదిలిపెట్టకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుండగా తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పీడ్ పెంచారు. ఇక రాష్ట్ర బీజేపీ సైతం ఉత్తరాంధ్రను సైతం లక్ష్యంగా చేసుకుని వైసీపీ‌పై మాటల దాడి పెంచింది. ఇక విపక్షాల మధ్య ఎన్నికల నేపథ్యంలో పొత్తుల కోసం అంతర్గత చర్చలు కూడా మొదలయ్యాయనే సమాచారం ఉండడంతో అవి బలపడక ముందే ఎన్నికలకు వెళితే ఎలావుంటుంది అని వైసీపీ వర్గాలు భావిస్తునట్టు తెలుస్తుంది, పైగా ఇంతకూ ముందు ఇదేసూత్రంతో తెలంగాణలో కేసీఆర్ విజయం సాధించారు. దాంతో ఏపీలోనూ ఆయన అడుగుజాడల్లో వైసీపీ వ్యూహం పన్న నుందని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అదేగనుక నిజమైతే ఎన్నికలకు 6 నుంచి 8 నెలల ముందే ఏపీలో ముందస్తు‌కు రంగం సిద్ధం కావొచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

ముందస్తు ఉండదు: మంత్రి ఆదిమూలపు సురేష్

అయితే ఏపీలో ముందస్తు ఉండే ఛాన్స్ లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. వైజాగ్‌లో ఆయన మాట్లాడుతూ ఇప్పుడే మంత్రివర్గ పునర్వవస్థీకరణ జరిగిన నేపథ్యంలో ముందస్తు ఉండే అవకాశం లేదన్నారు. 2024లోనే ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. కానీ ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం పరిస్థితి వేరేలా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి సీఎం జగన్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.



Next Story

Most Viewed