Mukkoti Ekadashi: అన్నవరం ఆలయానికి పోటెత్తిన భక్తులు

by srinivas |
Mukkoti Ekadashi: అన్నవరం ఆలయానికి పోటెత్తిన భక్తులు
X

దిశ, అన్నవరం: ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా కాకినాడ జిల్లా అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పిస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు. అన్నవరం పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుని పునీతులయ్యారు.

ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి ప్రధానాలయం యంత్రాలయం ఆలయాలను సుగంధ భరితమైన పుష్పాలతో మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న మెట్లమార్గానికి ఇరువైపులా చక్కటి పూల మొక్కలను ఏర్పాటు చేశారు. ఉత్తర ద్వార దర్శనం కోసం ఏర్పాటు చేసిన దర్శన క్యూలైన్లను చక్కగా తీర్చిదిద్ది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.

గతంలో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఉత్తర ద్వార దర్శనాన్ని అనుమతించిన అధికారులు ఈ ఏడాది వైదిక బృందం పండితులు సలహాలు సూచనలు మేరకు భక్తుల సౌకర్యార్థం సాయంత్రం 5 గంటల వరకు వీలు కల్పిస్తూ చర్యలు తీసుకున్నారు. సోమవారం ఉదయం స్వామి అమ్మవార్లను విశాఖ శారదా పీఠం చిన్న స్వామీజీ స్వత్మానంద స్వామిజీ దర్శించుకోగా పలువురు ప్రముఖులు కూడా అన్నవరం విచ్చేసి స్వామి అమ్మవార్లను ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకున్నారు.

Next Story

Most Viewed