Ananthapur: జేసీ బ్రదర్స్‌పై వరుస కేసులు, చార్జిషీట్‌లతో ఉక్కిరిబిక్కిరి

by srinivas |
Ananthapur: జేసీ బ్రదర్స్‌పై వరుస కేసులు, చార్జిషీట్‌లతో ఉక్కిరిబిక్కిరి
X

దిశ, అనంతపురం: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుస కేసులతో తాడిపత్రికి చెందిన జెసీ బ్రదర్స్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాడిపత్రిలో ఏర్పాటు చేసిన త్రిశూల్ సిమెంట్ కంపెనీ మొదలు ప్రబోధానంద స్వామి ఆశ్రమంపై దాడి, బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా మార్చి క్రయ, విక్రయాలు చేపట్టిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. దీంతో వాటన్నింటిపై పోలీసులు కేసులు నమోదు చేసి జేసీ బ్రదర్స్‌తో పాటుఅనుచరులపైనా కేసులు పెట్టారు. ఇక బీఎస్-త్రీ వాహనాలను బీఎస్-4 వాహనాలుగా మార్చిన కేసులో ఇప్పటికే కేసులు నమోదు కాగా ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించడంతో ఎన్‌‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రంగంలోకి దిగింది. ఈ కేసులో వారికి సంబంధించిన రూ.22.10 కోట్ల స్థిర, చర ఆస్తులను జప్తు చేసింది. తాజాగా బీఎస్ త్రీ వాహనాలను bs4 వాహనాలుగా మార్చి క్రయవిక్రయాలు చేసిన కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి, ముఖ్య అనుచరుడు చవ్వా గోపాలరెడ్డిపై తాడిపత్రి పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఇక 2018వ సంవత్సరంలో ప్రబోధానంద స్వామి ఆశ్రమంపై దాడి చేసిన కేసులో మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డిపై పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. ఇలా జేసీ బ్రదర్స్ వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

పోలీసులపై కేసుల యుద్ధం

గతంలో తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ బ్రదర్స్ ఏది చెబితే అది నడిచే పరిస్థితి ఉండేది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారిపై ఒక్కటి ఒక్కటిగా కేసులు నమోదు అవుతూ వచ్చాయి. దీనిపై పోలీసుల తీరును జేసీ బ్రదర్స్ తప్పుబడుతున్నారు. తమ పార్టీ నాయకులను, కార్యకర్తలను తాడిపత్రి డీఎస్పీ అనవసరంగా వేధిస్తూ, కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ అతనిపై కోర్టులలో ప్రైవేటు కేసులు వేయడం మొదలుపెట్టారు. ఇలా ఇప్పటికే ఆయనపై సుమారుగా 10కి పైబడి ప్రైవేటు కేసులు నమోదు అయి ఉన్నాయి. ఆయనపై కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ జేసీ బ్రదర్స్‌పై కూడా కేసులో నమోదు చేసుకుంటూ వచ్చారు. తాము చట్టపరంగానే ముందుకు వెళ్తున్నామని పోలీసులు పేర్కొంటూ బ్రదర్స్ చేసిన అవినీతి, అక్రమాలను ఒక్కొక్కటిగానే వెలుగులోనికి తీసుకొని వస్తూ వారి ఆర్థిక మూలాలను దెబ్బతీసే పనిలో పడ్డారు. అధికార పార్టీ ఇచ్చిన ప్రోద్బలంతోనే తాడిపత్రి డీఎస్పీ పార్టీ కార్యకర్తగా మారి తనపై అనవసర కేసులు పెడుతూ ఉన్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి పలుమార్లు ఆరోపించాడు. ఈ క్రమంలో వారి మధ్య మాటల యుద్ధంతో పాటు కేసుల యుద్ధం కూడా మొదలైంది. పలు సందర్భాలలో జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి పోలీసులు మరీ ముఖ్యంగా తాడిపత్రి డీఎస్పీ చైతన్య పని తీరును తప్పుపడుతూ వచ్చారు. దీనిపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సైతం ఈ విషయాన్ని పలు వేదికలపై ప్రస్తావించారు. పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా మారి తమ పార్టీ నాయకులను, కార్యకర్తలను వేధిస్తున్నారని నారా చంద్రబాబునాయుడు సైతం ఉదాహరణలతో పేర్కొన్నారు. ఇలా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ పోలీసులు అన్న చందంగా వ్యవహారం నడుస్తూ వచ్చింది. తాడిపత్రిలో అధికార పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డు తగులుతూ డీఎస్పీ‌ని టార్గెట్ చేస్తూ వచ్చారు.

బియస్ -3 వాహనాల కేసులో ఛార్జిషీట్ దాఖలు

బిఎస్‌-3 వాహనాలను తుక్కు కింద కొనుగోలు చేసి వాటిని ఫోర్జరీ డాక్యుమెంట్లతో బియస్ -4 వాహనాలుగా మార్చి రిజిస్ట్రేషన్‌ చేసి అమ్మిన కేసులో తాడిపత్రి పోలీసులు విచారణను వేగవంతం చేశారు. తప్పుడు పత్రాలతో బిఎస్‌-3 వాహనాలను బిఎస్‌-4 రిజిస్ట్రేషన్‌ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లి వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డితోపాటు జేసి ప్రధాన అనుచరుడు జఠాధర ఇండస్ట్రీస్ అధినేత గోపాల్ రెడ్డితోపాటు మరో 12 మందిపై తాడిపత్రి పోలీసులు 830 పేజీల చార్జ్ షీట్ తాడిపత్రి కోర్టులో దాఖలు చేశారు. దీనిపై ఇది వరకే అనంతపురం వన్ టౌన్ పోలీస్టేషన్‌లో, తాడిపత్రి పోలీసు స్టేషన్లలో 35 కేసులు నమోదయిన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో తాడిపత్రి పోలీసులు 830 పేజీలతో ఛార్జీషీట్‌ను తాడిపత్రి జ్యూడిషయల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో దాఖలు చేశారు. ఇందులో తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జెసి.ప్రభాకర్‌రెడ్డి ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డి, ఆయన అనుచరుడు జఠాధర సంస్థ ప్రతినిధి సి.గోపాల్‌రెడ్డితోపాటు 12 మందిపై అభియోగాలను మోపుతూ చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. బిఎస్‌-3 వాహనాలకు సంబంధించి అనంతపురము వన్ టౌన్ పోలీస్టేషన్‌లో 12 కేసులు, తాడిపత్రి పోలీస్టేషన్‌లో 23 కేసులు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారందరి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులను చెన్నైలో నున్న అశోక్‌ లైల్యాండ్‌ సంస్థకు లావాదేవీలు సాగినట్టు పోలీసులు ఛార్జిషిట్‌లో పేర్కొన్నారు. ఛార్జిషీట్‌ దాఖలుతో ఈ కేసు విచారణలో పురోగతి వేగవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 151 బియస్ -3 వాహనాలను స్క్రాప్ కింద కొనుగోలు చేసి, ఫోర్జరీ సంతకాలతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బిఎస్‌-4వాహనాలుగా మార్చి రిజిస్ట్రేషన్‌ చేశారన్న ఆరోపణలపై గతంలోనే జెసి.ప్రభాకర్‌రెడ్డి, జెసి.అస్మిత్‌రెడ్డి, గోపాల్‌రెడ్డిలపై కేసులు నమోదై ఉన్నాయి. వీరు ఈ కేసుల్లో జైలుకు సైతం వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇప్పుడు ఈ కేసులో జరిగిన అవతవకలు అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఎన్‌పోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు విచారణ చేపట్టారు. తాడిపత్రి వచ్చి జేసి ఇంట్లో దాదాపు 17 గంటల పాటు సోదాలు చేసి కీలకమైన డాక్యుమెంట్లతోపాటు జేసి సోదరుల సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. కార్పొరేట్‌ సంస్థ అయిన అశోక్‌ లేల్యాండ్ సంస్థ ప్రమేయంపైనా దర్యాప్తు సంస్థ విచారణ చేపడతామని కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో విచారణ చేపట్టిన పోలీసులు ఛార్జిషీట్‌ను దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. ఇంకా అనంతపురం వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో నమోదైన 12 కేసుల్లో విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో ఎటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయన్నది వేచి చూడాల్సి ఉంది.

ప్రభోదానంద ఆశ్రమంపై దాడిలో జేసీ దివాకర్ రెడ్డిపై ఛార్జ్‌షీట్

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ప్రభోదానంద స్వామి ఆశ్రమంపై దాడి కేసులో జేసీ దివాకర్ రెడ్డిపై తాడిపత్రి పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. 2018లో జరిగిన ప్రభోదానంద ఆశ్రమం వద్ద అల్లర్ల ఘటన జరిగిన విషయం తెలిసిందే. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ప్రబోధానంద స్వామి ఆశ్రమంపై దాడి కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. 2018వ సంవత్సరంలో ప్రబోధానంద స్వామి ఆశ్రమంపై దాడి చేశారు. ఇందులో తాజాగా 13 మందిని అరెస్టు చేసి రిమాండ్2కు తరలించారు. ఇందులో తాడిపత్రి, పెద్దపొలమడ గ్రామాలకు చెందిన జెసి బ్రదర్స్ అనుచరులు ఉండడం గమనార్హం. ఇప్పటికే తాడిపత్రికి చెందిన పలువురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా ఈ కేసులో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై పోలీసులు చార్జి షీట్ దాఖలు చేశారు. ఇలా అన్నదమ్ములు ఇద్దరిపై వివిధ కేసులలో చార్జిషీట్ దాఖలు కావడం గమనార్హం. దీంతో అనంతపురం జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతూ ఉండగా జేసీ బ్రదర్స్ అనుచరులలోనూ ఒక విధమైన కలవరం రేకెత్తింది.

Next Story

Most Viewed