- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పోలీసు ప్రతిష్ట పెంచేలా పని చేయాలి.. DIG ఎం.రవిప్రకాష్

దిశ, అనంతపురం: పోలీసు ప్రతిష్టను పెంచేలా అందరూ పని చేయాలని, అవినీతి జోలికెళితే ఉపేక్షించేదిలేదని అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఎం.రవిప్రకాష్ హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని సోమందేపల్లి పోలీసు స్టేషన్ ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. స్టేషన్ పరిధిలో భూముల ధరలు బాగా పెరగడంతో అదే స్థాయిలో వివాదాలు తద్వారా బాడిలీ అఫెన్సెస్ పెరిగాయన్నారు. బాడిలీ అఫెన్స్ తగ్గించేందుకు కృషి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. యు.ఐ ( అండర్ ఇన్వెస్టిగేషన్ ) లో ఉన్న 42 రోడ్డు ప్రమాదాల కేసులలో దర్యాప్తు పూర్తి చేసి త్వరగా ఛార్జిషీటు దాఖలు చేయాలన్నారు. అన్ని బ్లాక్ స్పాట్స్ ను జాయింట్ బృందాలతో తనిఖీ చేసి తగు చర్యలు తీసుకుని రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని ఆదేశించారు. పేకాట, పి.డి.ఎస్ రైస్ అక్రమ రవాణాలపై దృష్టి పెట్టాలన్నారు. పేకాట, పి.డి.ఎస్ రైస్ అక్రమ రవాణాలకు స్థానిక పోలీసు సిబ్బంది సహకరిస్తున్నారని అక్కడ కలిసిన విలేకరుల ద్వారా దృష్టికి రావడంతో దీనిపై కూడా విచారించి నివేదిక పంపాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీకి డి.ఐ.జి సూచించారు.
పురోగతి లేని కీలకమైన కేసులలో భాగంగా 2017 సంవత్సరంలో జరిగిన గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసు, 2019 లో జరిగిన దోపిడీ కేసులను త్వరితగతిన ఛేదించాలన్నారు. ఈ రెండు కేసుల ఛేదింపు కోసం వేర్వేరుగా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఛీటింగ్, ఫోర్జరీ, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన తేవాలన్నారు. అంతకుముందు ఆయన పోలీసు స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పని తీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, తదితర అంశాలను సమీక్షించారు. వివిధ నేరాల్లో సీజ్ చేసిన వాహనాలతో పోలీసు స్టేషన్ ఆవరణ నిండి ఉండటంతో తక్షణమే ఆ వాహనాలను నెలలోపు చట్టపరిధిలో డిస్పోజల్ చేయాలని ఎస్సైను ఆదేశించారు.