- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Tadipatri: సీఐ ఆత్మహత్యకు పొలిటికల్ రంగు.. వైసీపీపై టీడీపీ తీవ్ర ఆరోపణలు

దిశ, డైనమిక్ బ్యూరో: అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్యకు రాజకీయ రంగు పులుముకుంది. పని ఒత్తిడి కారణంతోనే తన తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆనందరావు కుమార్తె భవ్య ఆరోపించిన సంగతి తెలిసిందే. వైసీపీ నాయకుల ఒత్తిడితోనే ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నాడని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే కేవలం రాజకీయ లబ్ధి కోసమే తమపై నిందలు వేస్తున్నారని వైసీపీ కౌంటర్ ఇస్తోంది. సీఐ ఆనందరావు ఆత్మహత్యపై పోలీసులు పారదర్శకంగా విచారణ జరపాలని అటు వైసీపీ, ఇటు టీడీపీ డిమాండ్ చేస్తోంది. సీఐ ఆత్మహత్య పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో రాజకీయంగా ఉద్రిక్తతలకు దారి తీసింది.
వైసీపీ నాయకుల ఒత్తిడి వల్లే : జేసీ ప్రభాకర్ రెడ్డి
కాగా సీఐ ఆనందరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీంతో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి ఆనందరావు మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ రాజకీయ ఒత్తిళ్లతోనే సీఐ ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. సీఐగా బాధ్యతలు చేపట్టిన 9నెలల కాలంలో సుమారు ఐదు నెలల నుంచి వైసీపీ నాయకులు తీవ్ర ఒత్తిడిలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ లీడర్లను కొన్ని కేసుల్లో నుంచి తప్పించేందుకు తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చారని, ఫలితంగానే ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.
రాజకీయ లబ్ధికోసం వైసీపీపై నిందలు: ఎమ్మెల్యే పెద్దారెడ్డి
సీఐ ఆనందరావు ఆత్మహత్యను టీడీపీ రాజకీయల లబ్ధికి వాడుకోవాలని చూస్తోందని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. వైసీపీ నాయకులపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పోలీసులను ఎంత ఇబ్బందులకు గురి చేశారో తాడిపత్రి ప్రజలకు తెలుసును అని గుర్తు చేశారు. సీఐ ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడటం చాలా విచారకరమన్నారు. ఈ సంఘటనపై విచారణ చేయాలని ఉన్నతాధికారులను కోరనున్నట్లు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెల్లడించారు.
కాగా అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఆనందరావు ఆత్మహత్యతో పోలీసు శాఖలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. ఇంట్లోనే ఆయన ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. సీఐ ఆనందరావు ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు 1996 బ్యాచ్‌కు చెందిన వ్యక్తి. గతంలో ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాలో ఎస్ఐగా, సీఐగా విధులు నిర్వహించారు. సీఐ ఆనందరావు పోలీసు అధికారుల దగ్గర, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పోలీసు సిబ్బందితో సీఐ ఆనందరావు ఎంతో ఆప్యాయంగా ఉండేవారని అన్నారు. సీఐ ఆనందరావుకు ఇద్దరు కుమార్తెలు, భార్య ఉన్నారు. అయితే పని ఒత్తిడే తన తండ్రి ప్రాణం బలిగొందని ఆయన కుమార్తె భవ్య కన్నీరు పెట్టుకున్నారు. తాడిపత్రిలో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని, తన వల్ల కావడం లేదని చెప్పుకుని పలుమార్లు తన వద్ద బాధపడ్డారని భవ్య వాపోయారు.