Ap News: సీఎం జగనే కారణమంటూ ప్రభుత్వ టీచర్ ఆత్మహత్యాయత్నం

by srinivas |   ( Updated:2023-12-10 14:02:46.0  )
Ap News: సీఎం జగనే కారణమంటూ ప్రభుత్వ టీచర్ ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్ డెస్క్: సీపీఎస్ రద్దు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికలకు ముందు తాను అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు చేస్తానని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా సీపీఎస్ రద్దును పట్టించుకోకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనస్థాపానికి గురవుతున్నారు. సీపీఎస్ రద్దు కోసం ఆత్మహత్యలకు కూడా వెనకాడటంలేదు. తాజాగా అనంతపురం జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యయత్నం చేశారు.

సీపీఎస్ రద్దు చేయలేదన్న ఆవేదనతో ఉరవకొండ మండల చిన్న మస్తూరుకు చెందిన టీచర్ మల్లేశ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఈ ఉదయం విష గుళికలు మింగి బలవన్మరణానికి యత్నించారు. తన చావుకు సీఎం జగన్ కారణమంటూ ఐదు పేజీల లేఖ రాశారు. ప్రభుత్వ టీచర్లను సీఎం జగన్ మోసం చేశారని లేఖలో పేర్కొన్నారు. సీపీఎస్ రద్దు, 5వ తేదీకల్లా జీతాలివ్వడమే తన చివరి కోరిక అంటూ లేఖలో తెలిపారు. తన వెంట తెచ్చుకున్న సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి పెన్నఅహోబిలం ఆలయం సమీపంలో విష గుళికలు మింగి ఆత్మహత్య యత్నం చేశారు.

అపస్మారక స్థితిలో ఉన్న మల్లేశ్‌ను స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మల్లేశ్‌కు వైద్యం అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉందని, ఒక రోజు గడిస్తే గాని మల్లేశ్ ఆరోగ్య పరిస్థితిని చెబుతామని వైద్యులు తెలిపారు. అయితే మల్లేశ్ రాసిన లేఖ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సీఎం జగన్ ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలనే డిమాండ్‌కు మద్దతు పెరుగుతోంది.

Next Story

Most Viewed