- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దారుణం.. కోరిక తీర్చమని లాఠీతో కొట్టి..గొంతుకు వైరు బిగించి నరకం!

దిశ, డైనమిక్ బ్యూరో: ఆయనో రక్షక భటుడు. ఆపదలో ఉన్నవారిని రక్షించే ఆపద్బాంధవుడు. బాధ్యతాయుతమైన పోలీస్. అందులోనూ ఓ ఆడబిడ్డకు ఆయన తండ్రి కూడా. అలాంటి బాధ్యతాయుతమైన వ్యక్తి ఎవరైనా ఆకతాయిలు అమ్మాయిలను వేధిస్తే తండ్రిలా కాపాడాల్సింది పోయి అతడే మృగంలా మారాడు. అభం శుభం తెలియని ఓ అమ్మాయిని కాటేశాడు. తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుతున్న నిరుపేద బాలికను చెరబట్టాడు. ఈ అమానుష ఘటన అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
గుత్తి ప్రాంతానికి చెందిన రమేశ్ కానిస్టేబుల్. ఆయన భార్య ఎక్సైజ్ కానిస్టేబుల్. ఈ దంపతులకు ఒక అమ్మాయి సంతానం. భార్య భర్తలిద్దరూ ఉద్యోగులే కావడంతో వీరి పాపను చూసుకునేందుకు గుత్తి ప్రాంతానికే చెందిన ఓ బాలికను పనికి తెచ్చి పెట్టుకున్నారు. కానిస్టేబుల్ రమేశ్ ఇంట్లోనే ఆ మైనర్ బాలిక ఉంటూ వారి కూతురి అలనాపాలన చూసుకుంటుంది. అయితే బాలికపై కానిస్టేబుల్ రమేశ్ కన్ను పడింది. భార్య డ్యూటీకి వెళ్లినప్పుడు మాయమాటలు చెప్పి బాలికను లోబర్చుకున్నాడు. ఇలా ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. దీంతో బాలిక గర్భందాల్చగా కానిస్టేబుల్ రమేశ్ అబార్షన్ చేయించాడు.
అయితే ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయంతో బాలిక ఎవరికీ చెప్పలేదు. బాలిక నిస్సాహాయ స్థితిని అలుసుగా చేసుకుని రమేశ్ చిత్ర హింసలకు గురి చేయడం మొదలు పెట్టాడు. తన కోరిక తీర్చకపోతే లాఠీలతో కొడుతూ, గొంతుకు వైరు బిగించి నరకం చూపించేవాడు. రోజురోజుకు అతడు ఆకృత్యాలు తీవ్రమవ్వడంతో బాలిక ధైర్యం చేసి తల్లిదండ్రులకు చెప్పి కన్నీరుమున్నీరుగా విలపించింది. దీంతో తల్లిదండ్రులు బాలికతో కలిసి పోలీస్ ఉన్నతాధికారులను కలిసి కానిస్టేబుల్ రమేశ్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై ఫోక్సో చట్టం కింద అనంతపురం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం కానిస్టేబుల్ రమేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.