ఆళ్ల నాని.. పరిష్కారం చూపాలని..

by Disha Web Desk 4 |
ఆళ్ల నాని.. పరిష్కారం చూపాలని..
X

దిశ, ఉభయ గోదావరి ప్రతినిధి : వైద్యారోగ్య శాఖ మంత్రిగా చేసి, వైఎస్సార్ పార్టీలో తనదైన ముద్ర వేసుకొన్న మాజీ మంత్రి, ఏలూరు జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని ఇలాకాలో సమస్యలు తాండవిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ కోటరీలో ముఖ్యుడైనా సరే ఏలూరులో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించిన దాఖలాలు లేవని ప్రజలు పేర్కొంటున్నారు. ''ఏళ్ల నాటి సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. వైఎస్సార్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో నాని గెలుపుతో ఏలూరు ప్రగతి పథంలో నడుస్తుందని భావించామని, చివరికి చేసిందేమీ లేదని'' చెబుతున్నారు. సమస్యలతో సవాసం చేయాల్సి వస్తుంది. అనేక మార్లు మాజీ మంత్రికి విన్నవించినా ఫలితం లేదు అని' వాపోయారు. ఏలూరు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దిశ అందిస్తున్న కథనం..

సుదీర్ఘ రాజకీయ చరిత్ర

వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని సుదీర్ఘ కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. గతంలో కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న సమయంలో నానికి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో మంచి అనుబంధం ఉండేది. 2009 ఎన్నికల సమయంలో కొన్ని సమీకరణాల వల్ల నానికి సీటు ఇవ్వలేనని వైఎస్ పేర్కొనడంతో ఆయన కోపగించారు. వైఎస్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీంతో సీటు ఇవ్వాల్సి వచ్చింది. నాడు నాని గెలిచారు. ప్రస్తుతం నానికి జగన్‌తోనూ మంచి సంబంధాలున్నాయి. 2019 ఎన్నికల్లో గెలిచిన వెంటనే నానికి వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పజెప్పారు. కరోనా సమయంలో నిత్యం పరిస్థితిని సమీక్షించాల్సిన సమయంలో అనేక మార్లు ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకున్నారు. ఇలా ఇద్దరికీ మరింత అనుబంధం కుదిరింది. పార్టీలో నాని నంబర్2 అని కూడా వినిపించింది.

పవర్ ఫుల్.. సమస్యల పరిష్కారంలో నిల్?

రాజకీయంలో పవర్ ఫుల్ అయినా నాని, ఏలూరు సమస్యలు పరిష్కరించడంలో మాత్రం బాగా వెనుకంజలోనే ఉన్నారని ప్రజలు అంటున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరును అభివృద్ధి చేయాల్సిన విషయంలో నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తున్నారని చెబుతున్నారు. ఏలూరులో ప్రధానంగా ట్రాఫిక్ సమస్య వేధిస్తున్నది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు గురించి ప్రజలు అనేక మార్లు అడుగుతున్నారు. అలాగే తమ్మిలేరు వాగు సమస్య చాలా తీవ్రంగా వేధిస్తున్నది. తెలంగాణ నుంచి ప్రారంభమవుతున్న తమ్మిలేరు వాగు ఏలూరు మీదుగా కొల్లేరులో కలుస్తున్నది. తమ్మిలేరు వాగునకు ఇరు పక్కలా రివిట్ మెంటు కడుతున్నాగానీ ఫలితం లేదని అంటున్నారు. వాగు అనేక వర్షాలకు పొంగుతుందని, నీరంతా పట్టణంలోకి చేరుకుంటుందని చెబుతున్నారు. ఇటీవల వర్షాలకు నీట మునిగిపోయి పారిశుధ్యం లోపించి అనేక మంది వైరల్ జ్వరాల బారిన పడ్డారు. వర్షాకాలంలో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. దీన్ని నాని పట్టించుకొన్న దాఖలాలు లేవని ప్రజలు పేర్కొంటున్నారు.

Next Story