అలకవీడిన బాలినేని శ్రీనివాసరెడ్డి : సీఎం జగన్ కీలక హామీలు

by Seetharam |
అలకవీడిన బాలినేని శ్రీనివాసరెడ్డి : సీఎం జగన్ కీలక హామీలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న ఆ మాజీమంత్రి అలక వీడారా?ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అనంతరం కాస్త నెమ్మదించారా? అటు బావతో సయోధ్య కుదిరినట్లేనా? ఇక ఆ మాజీమంత్రి కోరుకున్నట్లు జిల్లా రాజకీయాల్లో ఆయనదే పై చేయి కానుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ అలకపాన్పు ఎక్కిన ఆ మాజీమంత్రి ఎవరో? ఇప్పటికే అర్థమై ఉంటుంది కదూ ఆయనే ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. మంత్రి పదవి పోయినప్పటి నుంచి వైసీపీ అధిష్టానంపై అలకబూనారు. మంత్రి పదవి పోయిన తర్వాత ఆయన అలకపాన్పు ఎక్కడంతో వైసీపీ కీలక నేతలు రంగంలోకి దిగి బుజ్జగించడంతో కాస్త నెమ్మదించారు. జిల్లాలో తన మాటకు విలువేలేదని ఆరోపిస్తూ ఏకంగా రీజినల్ కో ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. అప్పుడు కూడా కొంతమంది బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆయన అలానే ఉండిపోయారు. అనంతరం భూ ఆక్రమణలు, ఫేక్ డాక్యమెంట్స్ వ్యవహారంలో కలెక్టర్, ఎస్పీ తీరును నిరసిస్తూ మళ్లీ అలిగారు. అయితే ఈ వ్యవహారంలో సీఎం వైఎస్ జగన్ చూసీ చూడనట్లు వ్యవహరించారు. సీఎంవో కార్యాలయానికి వెళ్లినప్పటికీ మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి జగన్ అపాయింట్మెంట్ దొరకలేదు. చివరకు సీఎంవో ధనుంజయ్ రెడ్డితో చర్చించి వెనుదిరిగారు. అయితే తాజాగా సీఎం జగన్ అపాయింట్మెంట్ దొరకడంతో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితన గోడు వెల్లబోసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సీఎం జగన్ బాలినేనికి బోలెడు హామీలుఇచ్చారని తెలుస్తోంది. దాంతో నీరసంగా వెళ్లిన మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బయటకు వచ్చినప్పుడు మంచి జోష్‌తో రావడంతో ఆయన అలకపాన్పు దిగినట్లేనని అంతా చర్చించుకుంటున్నారు.

వరుసగా అలకపాన్పులు

ఒంగోలు జిల్లా వైసీపీలో కీలక నేత మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. గత ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికసైతం బాలినేని శ్రీనివాసరెడ్డి కనుసన్నుల్లోనే జరిగింది. టికెట్లు ఇప్పించుకోవడమేకాదు వారి గెలుపులో సైతం కీలకంగా వ్యవహరించారు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. అనంతరం జగన్ కేబినెట్‌లో బాలినేని శ్రీనివాసరెడ్డి బెర్త్ దక్కించుకున్నారు. అనంతరం మంత్రి వర్గ విస్తరణలో పదవి కోల్పోయారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇదే ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేశ్‌ను మంత్రివర్గంలో కొనసాగిస్తూ బంధువైన తనను పక్కన పెట్టడంపై బాలినేని శ్రీనివాసరెడ్డి అలకబూనారు. దీంతో సీఎం వైఎస్ జగన్ రంగంలోకి దిగి బాలినేని శ్రీనివాసరెడ్డిని బుజ్జగించారు. అనంతరం రీజినల్ కోఆర్డినేటర్ పదవి కట్టబెట్టారు. మంత్రి పదవి పోయిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టు కోల్పోయారు. గతంలో టికెట్లు ఇప్పించి గెలిపించుకున్న ఎమ్మెల్యేలు ఆయనకు పక్కలో బళ్లెంలా తయారయ్యారు. ఏకంగా వైసీపీ అధిష్టానానికి ఏకంగా ఫిర్యాదులు సైతం చేసేశారు. దీంతో అలకబూనారు. ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలోనూ మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అవమానం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు స్వాగతం పలికెందుకు వెళ్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన వెనుదిరగడంతో సీఎం వైఎస్ జగన్ మరీ ఫోన్ చేసి పిలుపించుకుని మరీ స్టేజ్ ఎక్కించి కార్యక్రమం ప్రారంభోత్సవంలో అగ్రతాంబూలం కల్పించారు. అనంతరం మళ్లీ సైలెంట్ అయిపోయారు. ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ పెట్టి మరీ కంటతడిపెట్టారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని.. వైసీపీ నేతలు కావాలనే సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

పెత్తనం అప్పగించినట్లే

ఇకపోతే ఒంగోలులో భూ కుంభకోణంలో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ వ్యవహారం బాలినేని శ్రీనివాసరెడ్డి ఇమేజ్‌కు డ్యామేజ్ తీసుకువచ్చింది. దీంతో రంగంలోకి దిగిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ కుంభకోణంలో ఎలాంటి వారు ఉన్నాసరే పట్టుకుని అరెస్ట్ చేయాలని ఎస్పీ, కలెక్టర్‌లను కోరారు. అంతేకాదు కొంతమంది ఆరోపణలు ఎదుర్కొంటున్న వివరాలనుసైతం పోలీసులకు బాలినేని శ్రీనివాసరెడ్డి అందించారు. అయినప్పటికీ పోలీసులు కేసులు నమోదు చేయకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గన్‌మెన్లను సరెండర్ చేశారు. ఈ మేరకు డీజీపీకి లేఖను సైతం రాశారు. ఈ అంశంపై సీఎంవో వివరణ కోరింది. ఈ నేపథ్యంలో సీఎంవోకు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. సీఎం జగన్ అపాయింట్మెంట్ కోరినప్పటికీ లభించలేదు. దీంతో ఈనెల 2న సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ఉన్నారు. ఈ భేటీలో సీఎం వైఎస్ జగన్ బాలినేని శ్రీనివాసరెడ్డికి కీలకమైన హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒంగోలు రాజకీయాల్లో బాలినేని చెప్పిందే వేదం అని చెప్పారు. జిల్లా రాజకీయం అంతా ఆయనకే అప్పగించినట్లు తెలుస్తోంది. ఒంగోలు రాజకీయాల్లో వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి జోక్యం ఉండదని వెల్లడించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో భూ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు ఇస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించినట్లు తెలుస్తోంది. ఒంగోలు జిల్లాలోనే కాకుండా వైసీపీలో ఇకపై కీలక ప్రాధాన్యం ఉంటుందని బాలినేని శ్రీనివాసరెడ్డికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అలక వీడినట్లేనని తెలుస్తోంది.

వైసీపీని వీడను

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడాల్సిన అవసరం తనుకు లేదు అని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను గతంలోనే ఖండించానని.. మళ్లీ ఖండిస్తున్నట్లు తెలిపారు. తాను వైసీపీలోనే కొనసాగుతానని అందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం జగన్‌ను కలిశారు. అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాలు, నియోజకవర్గ అభివృద్ధి గురించి సీఎంతో మాట్లాడినట్లు వెల్లడించారు. తమ నియోజకవర్గంలో భూ ఆక్రమణలపై ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ భూ ఆక్రమణల ఘటనలో నిందితులను అరెస్ట్‌ చేయమని చెప్తే కొంత ఆలస్యం చేశారని... అందుకని కోపం వచ్చి గన్‌మెన్లను సరెండర్‌ చేసినట్లు బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. తాను గన్‌మెన్‌లను సరెండర్ చేసిన అనంతరం ఇప్పటి వరకు ఈ కేసులో 40 మందిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. భూకబ్జాలు ఎవరు చేసినా అరెస్టులు చేయిస్తామని తెలిపారు.తాను విలువైన రాజకీయాలే చేస్తాను అని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

Next Story

Most Viewed