అన్నంలో ఏదైనా కలిపి చంద్రబాబును చంపేయోచ్చు: భువనేశ్వరిపై డిప్యూటీ సీఎం ఆరోపణలు

by Seetharam |
Narayana Swami
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబును చంపేందుకు నారా భువనేశ్వరి ప్లాన్ చేసే అవకాశం ఉందని ఆరోపించారు. ఇప్పటికే భువనేశ్వరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మరోసారి ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుకు భోజనం పంపిస్తున్న నారా భువనేశ్వరి, అన్నంలో ఏదో కలిపి ఆయనను చంపేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో కూడా తాను ఇదే వ్యాఖ్యలు చేశానని ఈ వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణమైన చంద్రబాబును మట్టుబెట్టేందుకు ఆయన కుమార్తెలు ప్రయత్నిస్తున్నారన్నారు. నారా భువనేశ్వరి, పురంధేశ్వరి ఎన్టీఆర్ బిడ్డలే కాబట్టి ఆయన మృతికి కారణమైన చంద్రబాబుపై పగఉండి ఉండవచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంతోనే చంద్రబాబును చంపి లోకేశ్‌ను సీఎం చేయాలని చూస్తున్నారంటూ బాంబు పేల్చారు. ఇన్నాళ్లు చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పించుకునేవారని కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యిందన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయలేకపోతున్నారని... న్యాయస్థానాలు సైతం ఇప్పుడే కళ్లు తెరుచుకున్నాయంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కాంట్రావర్సి కామెంట్స్ చేశారు.

చంద్రబాబు అవినీతిపరుడు

తెలుగుదేశం పార్టీ అంటే టెర్రరిస్టుల పార్టీ అంటూ కొత్త అర్థం చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ పార్టీని లాక్కున్న వ్యక్తి వెన్నుపోటు దారుడు చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇంటికి ఒక బంగారు ముద్ద ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినా ఇస్తారని..అక్కడితో ఆగిపోరని ఒక్కొక్క రైతుకు ఒక్కొ ట్రాక్టర్ ఇస్తానంటారని... యువకులకు మోటార్ సైకిల్ ఇస్తారని హామీలు గుప్పిస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు హామీలను నమ్మి ఎవరూ మోసపోవద్దు అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సూచించారు. చంద్రబాబు తప్పు చేసి జైలుకు వెళ్తే.... ఎలాంటి తప్పు చేయకుండా జగన్‌ను అప్పట్లో సోనియా గాంధీ, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కలిసి జైలుకు పంపించారని ఆరోపించారు. లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత, సీఎం జగన్ ఇలాంటి ఎందరో వ్యక్తులు జైలుకు వెళ్లినప్పుడు ఆందోళనలు జరగలేదని కానీ ఒక అవినీతిపరుడు జైలుకెళ్తే టీడీపీ ఆందోళనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. స్కిల్ స్కాం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు టీడీపీ యత్నిస్తోందని ఆరోపించారు. స్కిల్ స్కాంలో రూ.371 కోట్లు చంద్రబాబు దోచేశారని సెంట్రల్‌ ఏజెన్సీలు నోటీసులు ఇస్తే ఆయనపై కేసు పెట్టడం అక్రమమా? అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ప్రశ్నించారు.

Next Story