విశాఖలో Drone పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలి

by Disha Web Desk |
విశాఖలో Drone పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలి
X

దిశ, డైనమిక్ బ్యూరో : దేశంలో వ్యవసాయంతోపాటు అనేక రంగాల్లో డ్రోన్‌ పరిజ్ఞానం వినియోగం పెరుగుతున్న దృష్ట్యా డ్రోన్‌ టెక్నెలజీపై మరింత విస్తృత పరిశోధనలు జరిపేందుకు విశాఖపట్నంలో జాతీయ స్థాయి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వైసీపీ సభ్యులు విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో సోమవారం జీరో అవర్‌లో విజయసాయిరెడ్డి డ్రోన్ పరిశోధనా కేంద్రంపై మాట్లాడారు. 'నాలుగో పారిశ్రామిక విప్లవంలో ఆవిష్కృతమైన అత్యంత కీలక సాంకేతిక పరిజ్ఞానాలలో డ్రోన్‌ టెక్నాలజీ ఒకటి. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత వ్యవసాయం, రక్షణ, రవాణా రంగాలతోపాటు అనేక రంగాలలో డ్రోన్ల వినియోగం బాగా పెరిగింది. డ్రోన్‌ టెక్నాలజీ, వినియోగంలో దేశం ముందంజలో ఉంది. దీనిని మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా వ్యవసాయ రంగంలో క్రిమిసంహారక మందులు చల్లేందుకు, పొలాల్లో తేమ శాతాన్ని పర్యవేక్షించేందుకు, పంట ఎదుగుదలలో వివిధ దశలకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. డ్రోన్‌ టెక్నాలజీ సాయంతో తక్కువ శ్రమతో రైతులు పంట దిగుబడులను 15 శాతం వరకు పెంచే అవకాశం ఉంది' అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

'ఏపీలో 65 శాతం జనాభా వ్యవసాయంపైనే ఆధారపడ్డారు. వ్యవసాయ రంగంలో కొత్త పరిశోధనలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి సాగులో ప్రయోగాలకు రాష్ట్ర రైతాంగం ఎప్పుడూ ముందుంటారు. అలాగే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో రాష్ట్రం అపారమైన మానవ వనరులను కలిగి ఉందని విజయసాయి రెడ్డి చెప్పారు. ఐటీ నిపుణులు అనేక నూతన ఆవిష్కరణలతో తమ ప్రతిభాపాటవాలను ప్రపంచానికి చాటి చెప్పారు. ఆహార ధాన్యాలతోపాటు పండ్లు, కూరగాయల సాగులో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. రైతులు క్రమేణా ఆయిల్‌ పామ్‌ సాగు వైపు కూడా మళ్ళుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో గణనీయమైన పురోగతి సాధించడం ద్వారా రైతులు దేశ ప్రగతికి తోడ్పడుతున్నందున వారికి ఎంతగానో ఉపకరించే డ్రోన్ల పరిజ్ఞానాన్ని మరింత విస్తృతపరచేందుకు విశాఖపట్నంలో జాతీయ డ్రోన్‌ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి' అని విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


Next Story

Most Viewed