ఏపీలో 8 కోట్ల మంది మొబైల్‌ వినియోగదారులు: కేంద్రమంత్రి చౌహాన్

by Disha Web Desk 21 |
ఏపీలో 8 కోట్ల మంది మొబైల్‌ వినియోగదారులు: కేంద్రమంత్రి చౌహాన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో మొబైల్‌ ఫోన్‌ వినియోగదారుల సంఖ్యం 8.20 కోట్లకు చేరింది అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని 17328 గ్రామాలకుగాను 15322 గ్రామాల్లో మొబైల్ టెలిఫోన్‌ నెట్‌వర్క్‌ సదుపాయం కల్పించినట్లు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవ్ సిన్హ్ చౌహాన్ వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం వైసీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. గడిచిన పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ టెలీకాం కనెక్టివిటీ లైసెన్స్ సర్వీస్ ఏరియా గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం బేస్ ట్రాన్సీవర్ స్టేషన్ల (బీటీఎస్) సంఖ్య 53,858 నుంచి 2,07,330కు పెరిగిందని తెలిపారు. అలాగే మొత్తం మొబైల్ సబ్ స్క్రైబర్స్ సంఖ్య 6.71 కోట్ల నుంచి 8.20 కోట్లకు, ఇంటర్నెట్ సబ్‌స్క్రైబర్స్ సంఖ్య 1.76 కోట్ల నుంచి 6.71 కోట్లకు పెరిగిందని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16,714 బీటీఎస్‌లు 5జీ నెట్‌వర్క్ కనెక్టివిటీని అందిస్తున్నాయి. అలాగే భారత్ నెట్ ప్రాజెక్టు కింద 12,457 గ్రామాల్లో నెటవర్క్ సదుపాయం కల్పిస్తున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవ్ సిన్హ్ చౌహాన్ తెలిపారు.

ఆప్టికల్ ఫైబర్ కేబుల్ విస్తరణకు చర్యలు

దేశంలో నెట్‌వర్క్ కనెక్టివిటీలేని గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం అనేక పథకాలు చేపడుతోందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవ్ సిన్హ్ చౌహాన్ వివరించారు. నెట్‌వర్క్ కనెక్టివిటీలేని ప్రాంతాల్లో రూ.41,331 కోట్ల వ్యయంతో 41,160 మొబైల్ టవర్స్‌ ఏర్పాటు చేయడం ద్వారా ఏపీతో సహా దేశంలోని 54,000 గ్రామాలకు నెట్‌వర్క్ సదుపాయం కల్పించవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. టెలికాం టవర్స్ ఏర్పాటు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ విస్తరణ వంటి టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను త్వరితగతిన విస్తరించేందుకు రైట్ ఆఫ్ వే (ఆర్‌ఏడబ్ల్యు) ఆమోదం క్రమబద్ధీకరించి వేగవంతం చేసేందుకు 2022 మే 14న గతిశక్తి పోర్టల్‌ను ఆవిష్కరించినట్లు స్పష్టం చేశారు. గతిశక్తి పోర్టల్‌ దేశంలో 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అనుసంధానం చేయడంతోపాటు, రైల్వే, రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు, రక్షణ శాఖ వంటి మంత్రిత్వ శాఖలతో అనుసంధానం చేస్తుందని అన్నారు. పోర్టల్ ఆవిష్కరణ అనంతరం ఆర్‌ఓడబ్ల్యు ఆమోద సమయం గణనీయంగా తగ్గిందని చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా 738 జిల్లాల్లో 3.99 లక్షల బీటీఎస్‌లు ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అత్యంత వేగంగా 5జీ నెట్ వర్క్‌ను విస్తరించే దేశాల సరసన ఇండియా నిలిచిందని అన్నారు. అలాగే దేశంలో 2014 మార్చి నాటికి ఏర్పాటు చేసిన బీటీఎస్‌ల సంఖ్య 6.49 లక్షలు ఉండగా మార్చి, 2023 నాటికి అది 25.42 లక్షలకు చేరిందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవ్ సిన్హ్ చౌహాన్ తెలిపారు.

Next Story

Most Viewed