త్వరలో ఎమ్అండ్ఎమ్ క్యాబ్ సర్వీసులు!

by  |
త్వరలో ఎమ్అండ్ఎమ్ క్యాబ్ సర్వీసులు!
X

దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా క్యాబ్ సర్వీలను ప్రారంభించనుంది. ముఖ్యంగా కార్పొరేట్ల కోసం ‘అలైట్’ అనే క్యాబ్ సర్వీసుల సముదాయంలోకి రావడానికి సిద్ధమవుతోంది. మరో రెండు మూడేళ్లలో అలైట్ సేవలను మొదలుపెట్టాలని ఆనంద్ మహీంద్రా నేతృత్వంలోని ఎమ్ అండ్ ఎమ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే, ఇప్పటికే క్యాబ్ సర్వీసులను నిర్వహిస్తున్న ఉబర్, ఓలా సంస్థలకు మహీంద్రా అండ్ మహీంద్ర సంస్థ గట్టి పోటీని ఇవ్వడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

అలైట్(ప్రస్తుతమున్న మహీంద్రా లాజిస్టిక్స్), గ్లైడ్(ఎమ్అండ్ఎమ్ ఈ-వెహికల్ క్యాబ్ సర్వీస్), మెరూ క్యాబ్స్(ఇందులో ఎమ్అండ్ఎమ్‌కు మెజారిటీ షేర్ ఉంది) ఇలా అన్ని విభాగాలను ఏకం చేస్తూ అలైట్ మొబిలిటీ సర్వీసులను ప్రారంభించాలని సంస్థ భావిస్తోంది. దీనికోసం అలైట్ అనే ఒక యాప్‌ను కూడా తీసుకురానుంది. ఈ త్రైమాసికం నుంచే బ్రాండ్‌ను అధికారికంగా పరిచయం చేస్తామని మహీంద్రా లాజిస్టిక్స్ సీఈవో రామ్ ప్రవీణ్ తెలిపారు.

అలైట్ మొదలయ్యాక ప్రాథమికంగా కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులను.. ఇంటి నుంచి ఆఫీసుకు, ఆఫీస్ నుంచి ఇంటికి, అలాగే వివిధ సమావేశాలకు, విమానాశ్రయాలకు తీసుకెళ్లడానికి అవసరమైన సేవలు ఉండనున్నాయి. ఆ తర్వాత భవిష్యత్తులో ఆన్-కాల్ సర్వీసులను తీసుకురానున్నారు. వీటిన్నిటిని పలు సంస్థలతో ఒప్పందం ప్రకారం సేవలు అందిస్తామని ఆయన అన్నారు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఉబర్, ఓలా లాంటి సంస్థలు కార్పొరేట్ ఫీచర్ ద్వారా కార్పొరేట్ క్యాబ్స్ సర్వీసుల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఉబర్ కంపెనీ ఉబర్ ఫర్ బిజినెస్ సేవలను మొదలుపెట్టింది. ఉబర్, ఓలా సంస్థలు అందించే సేవలతో పోలిస్తే అలైట్ అందించే సేవలు భిన్నంగా ఉంటాయని సంస్థ వెల్లడించింది.

Next Story