మోడీ లైట్స్ ఆఫ్ పిలుపుతో గ్రిడ్ కుప్ప కూలుతుందా..!

by  |
మోడీ లైట్స్ ఆఫ్ పిలుపుతో గ్రిడ్ కుప్ప కూలుతుందా..!
X

– ఫేక్ ప్రచారమంటున్న విద్యుత్ రంగ నిపుణులు

దిశ, న్యూస్ బ్యూరో‌: కరోనా వైరస్ (కొవిడ్ -19)పై పోరుకు మోడీ ఇచ్చిన లైట్ అవుట్ పిలుపుతో దేశంలో పవర్ గ్రిడ్ పరిస్థితి ఏంటి.. ప్రజలంతా ఆదివారం తొమ్మిదింటికి ఒక్కసారిగా లైట్లు ఆర్పేసి 9 నిమిషాలపాటు అలానే ఉండి మళ్లీ ఒక్కసారిగా లైట్లు వేస్తే గ్రిడ్ కుప్పకూలుతుందా.. కుప్పకూలి ఇళ్లలో ఉన్న టీవీ, ఫ్రిజ్, ఏసీ ఇలా అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు పాడవుతాయా.. అనే సందేహాలు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో గత రెండ్రోజులనుంచి చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ సందేహాలన్నీ అర్థం లేనివిగా విద్యుత్ రంగ నిపుణులు, పవర్ డిపార్ట్‌మెంట్ అధికారులు చెబుతున్నారు. జాతీయ స్థాయిలో పవర్ గ్రిడ్‌ను పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (పొసొకో) ఆధ్వర్యంలో నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నుంచి నిర్వహిస్తుంటుంది. ఇది దేశం మొత్తం మీద ఆ సెకనుకు, నిమిషానికి ఉన్న డిమాండ్‌ను బట్టి రియల్ టైంలో గ్రిడ్‌ను సర్దుబాటు చేస్తుంటుంది.

నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నుండి రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్‌కు అక్కడి నుంచి స్టేట్ లోడ్‌ డిస్పాచ్ సెంటర్‌కు ఇక్కడి నుంచి ఇళ్లల్లోకి కరెంటు ప్రవాహం జరుగుతుంటుంది. దీన్ని మొత్తం కలిపి దేశ పవర్ గ్రిడ్ అని అంటారు. కేంద్ర పవర్ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో ఏప్రిల్ 2వ తేదీన పీక్ డిమాండ్ 1లక్షా25వేల817 మెగావాట్లుగా నమోదైంది. ఇదే రోజు గత సంవత్సరంతో నమోదైన విద్యుత్ పీక్ డిమాండ్ 1 లక్షా 68వేల 500 మెగావాట్లుగా ఉంది. అంటే లాక్ డౌన్ వల్ల ఇప్పటికే దేశవ్యాప్తంగా పీక్ విద్యుత్ డిమాండ్ 43వేల మెగావాట్లు తగ్గింది. ఒకవేళ ఆదివారం రాత్రి దేశవ్యాప్తంగా 9 నిమిషాల పాటు అన్ని ఇళ్లలో లైట్లు ఆపేస్తే 25 నుంచి 30 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ తగ్గి 90 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు లెక్కలు కడుతున్నారు. ఇలా ఒక్కసారిగా డిమాండ్ తగ్గడం వల్లే గ్రిడ్ కుప్పకూలుతుందని పలువరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారానికి ఎలాంటి ఆధారాల్లేవని అధికారులు కొట్టేస్తున్నారు. సాధారణంగా సాయంత్రం 4 గంటలకు లైట్లు వెలగనుప్పుడు సైతం 90వేల మెగావాట్ల డిమాండ్ ఉంటోందని ఇదే పరిస్థితి రాత్రి తొమ్మిదింటికి తలెత్తినంత మాత్రాన కొత్తగా జరిగే నష్టమేమీ లేదని వారంటున్నారు. అలాగే రాత్రి పడుకునేటపుడు కూడా అన్ని ఇళ్లలో లైట్లు ఆఫ్ చేస్తారనీ, ఇలాంటి సమయాల్లో గ్రిడ్ దానంతట అదే లోడ్‌కు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటుందని చెబుతున్నారు.

సడెన్‌గా లోడ్ పెరిగినా, తగ్గినా తట్టుకోవడం గ్రిడ్‌కు కొత్తేమీ కాదని వారు పేర్కొంటున్నారు. లైట్లు ఆఫ్ అయినంత మాత్రానా ఏమీ కాదనీ, ఎండా కాలం కావడంతో ఇళ్లలో ఫ్రిజ్‌లు , ఏసీలు, అన్ని నడుస్తునే ఉన్నందువల్ల గ్రిడ్ పై పెద్ద ప్రభావమేమీ పడదని వివరిస్తున్నారు. ఆదివారం లైట్లు ఆపేసే సమయానికి పవర్ ప్లాంట్లలో ప్రొడక్షన్ ఆపేయాలన్న వాదనను వారు కొట్టిపారేస్తున్నారు.

ఎర్త్ డే.. కరోనా సండే మధ్య తేడా…

గతంలో గ్లోబల్ వార్మింగ్‌పై పోరులో భాగంగా దేశంలో ఎర్త్ డే నిర్వహించారు. ఈ సందర్భంలోనూ ఇళ్లలో లైట్లు ఆఫ్ చేయాలని పిలుపిచ్చారు. అయితే, అప్పుడు ఇండస్ట్రియల్, అగ్రికల్చర్ కేటగిరీల్లో విద్యుత్ వాడకం జరిగింది. దీంతో అప్పుడెలాంటి గ్రిడ్ సమస్యలు రాలేదు. ఇప్పుడు కరోనా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో ఇండస్ట్రియల్ డిమాండ్ పూర్తిగా పడిపోయింది. వ్యవసాయం సైతం కోత దశలో ఉన్నందున ఈ కేటగిరీలోనూ పెద్ద వినియోగం ఉండకపోవచ్చు. ఈ రెండు కేటగిరీల్లోనే విద్యుత్ వినియోగం దేశం మొత్తం విద్యుత్ వినియోగంలో 56 శాతం వరకు ఉంటుంది. 11 శాతం ఉన్న కమర్షియల్ కేటగిరీలోనూ ప్రస్తుతం వినియోగం లేదు. ఇక 33శాతం వినియోగం ఉన్న గృహ విద్యుత్ కేటగిరీలో ప్రధాని పిలుపు మేరకు ఆదివారం లైట్లు ఆఫ్ చేస్తే మరింత వినియోగం పడిపోయి గ్రిడ్ ఏమవుతుందోనన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

Tags: modi lights off call, grid failure, power grid, social media, power experts

Next Story

Most Viewed