గాంధీ విగ్ర‌హం ఎదుట కుటుంబంతో ఉద్య‌మ‌కారుడి దీక్ష‌.. ఎందుకంటే..?

by  |
గాంధీ విగ్ర‌హం ఎదుట కుటుంబంతో  ఉద్య‌మ‌కారుడి దీక్ష‌.. ఎందుకంటే..?
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : తెలంగాణ ఉద్యమకారులను టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏమాత్రం ప‌ట్టించుకోవడం లేద‌ని వ‌ల్ల‌పు శ్రీనివాస్ అనే ఉద్య‌మ‌కారుడు కుటుంబంతో స‌హా గాంధీ విగ్ర‌హం ఎదుట నిర‌స‌న దీక్ష‌కు దిగాడు. హ‌న్మ‌కొండ జిల్లా మ‌డికొండ గ్రామానికి చెందిన శ్రీనివాస్ గాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌కు జ‌రుగుతున్న అన్యాయంపై నిర‌స‌న వ్య‌క్తం చేశాడు. గ్రామంలోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌ల‌సి శాంతి దీక్ష‌కు కూర్చోవ‌డం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీలో 2001లో నుంచి తాను ప‌నిచేశాన‌ని, తెలంగాణ సాధ‌న పోరాటంలో నిర్విరామంగా పోరాటం చేశాన‌ని అన్నారు. పోలీస్ కేసులు, లాఠీచార్జిలు ప్ర‌యోగించార‌ని అన్నారు. 2009లో మ‌డికొండ‌లో జ‌రిగిన లాఠీ చార్జిలో త‌న వెన్నెముక దెబ్బ‌తింద‌ని, ఈ విష‌యాన్ని వైద్యులు కూడా ధ్రువీక‌రించార‌న్నారు. అప్ప‌టి నుంచి తాను ఏపని చేయ‌లేక‌పోతున్నాన‌ని, ఉద్య‌మం కోసం ఎంతో చేసినా త‌న‌ను పార్టీ కూడా ప‌ట్టించుకోలేద‌ని ఆవేద‌న చెందారు.

ప్ర‌భుత్వం ఆర్థికంగా ఆదుకోలేద‌ని, పార్టీ ప‌రంగా గుర్తింపు ద‌క్క‌లేద‌ని భావోద్వేగంతో తెలిపారు. పార్టీలో కొత్త‌గా వ‌చ్చిన‌వారికి అవ‌కాశాలు క‌ల్పించారు కానీ, ఉద్య‌మ స‌మ‌యంలో ప‌నిచేసిన వారికి అన్యాయం చేశారంటూ అధిష్ఠానం తీరును, పార్టీ ముఖ్యుల‌ను త‌ప్పుబ‌ట్టారు. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాల‌ని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. లేదంటే నిర‌స‌నగా శాంతి దీక్ష కొన‌సాగిస్తాన‌ని వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా శ్రీనివాస్ చేప‌ట్టిన దీక్ష‌కు మ‌డికొండ గ్రామానికి చెందిన రాజ‌కీయ పార్టీల నేత‌లు రాజ‌కీయాల‌కతీతంగా సంఘీభావం తెలిపారు. శ్రీనివాస్‌కు సంఘీభావం తెలిపిన వారిలో స్థానిక మాజీ ఎంపీపీ కుమారస్వామి, వ‌స్కుల శంకర్, మోహన్, దువ్వ విజయ్, అమ‌ర్‌నాథ్‌, డిష్ రామ్‌, నాగరాజు, శీను, వినయ్‌, త‌దితరులు పాల్గొన్నారు.


Next Story