భారీ తుఫాన్‌గా మారనున్న ‘ఎంఫాన్’

by  |
భారీ తుఫాన్‌గా మారనున్న ‘ఎంఫాన్’
X

న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఎంఫాన్ తుఫాన్ మరింత బలపడుతున్నదని, సోమవారం(నేడు) సాయంత్రానికల్లా భారీ తుఫాన్‌గా మారే అవకాశమున్నదని కేంద్ర హోం శాఖ హెచ్చరించింది. బుధవారానికల్లా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలను బలంగా తాకనుందని అంచనా వేసింది. దక్షిణ బంగాళాఖాతంలో ‘ఎంఫాన్’ తుఫాన్ బలపడిందని, సూపర్ సైక్లోన్‌గా మారనుందని వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. అతి తీవ్రమైన తుఫాన్‌గా మారే ప్రమాదమున్నదని పేర్కొంటూ.. పశ్చిమ బెంగాల్, ఒడిశా తీర సిబ్బందికి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు పంపింది. ఇప్పటికే ఒడిశా తీరంలో కనీసం 20 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి. ఈ నెల 21లోపు ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కీం, అసోం, మేఘాలయాలలో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని ఐఎండీ తెలిపింది. తుఫాన్ కదలికలు, తీవ్రరూపం దాల్చే అవకాశమున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ.. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎన్‌డీఎంఏ) అధికారులతో సాయంత్రం 4 గంటలకు ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు.

ఒడిశాలోని దక్షిణ పారాదీప్ నుంచి 790 కిలోమీటర్లు, బెంగాల్‌లోని దిఘా నుంచి 940 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌లోని కేపుపరా నుంచి 1060 కిలోమీటర్ల దూరంలో ఎంఫాన్ తుఫాన్ కేంద్రీకృతమై ఉన్నదని వివరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి దక్షిణం వైపుగా ఈ తుఫాన్ గంటకు సుమారు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నదని ఐఎండీ వెల్లడించింది. వచ్చే 12 గంటల్లో ఈ తుఫాన్ మరింత బలోపేతమై.. పుంజుకోనున్నట్టు తెలిపింది. మే 20వ తేదీలోపు బెంగాల్, బంగ్లాదేశ్‌ తీరాలకు గంటకు సుమారు 185 కిలోమీటర్ల వేగంగా వీచే గాలులతో చేరనున్నట్టు తెలిపింది.



Next Story