తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్

by  |

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు కొత్త గరిష్ఠాలకు చేరుకోవడంతో కంపెనీలు సైతం గిరాకీకి తగినట్టుగా కొత్త ఎలక్ట్రిక్ వాహనాలతో మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. తాజాగా మార్కెట్లో వినియోగదారుల ఆదరణ కోసం కంపెనీలు వీలైనంత తక్కువ ధరలో ఎలక్ట్రిక్ వాహనాలను అందించేందుకు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ వాహన తయారీ సంస్థ యాంపియర్ తన కొత్త ఎలక్ట్రిక్ మాగ్నస్ ఎక్స్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. రూ. 68,999(ఎక్స్‌షోరూమ్) ధరకే ఇది లభిస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

అధునాత ఫీచర్లతో ఈ కొత్త మాగ్నస్ ఎక్స్ స్కూటర్ ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 121 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సరికొత్త స్కూటర్ మెటాలిక్ రెడ్, గెలాక్టిక్ గ్రే, గ్రాఫైట్ బ్లాక్ రంగులతో లభిస్తుందని, ఇందులో తేలికైన పోర్టబుల్ లిథియం బ్యాటరీని అమర్చినట్టు కంపెనీ వివరించింది. అంతేకాకుండా ఈ బ్యాటరీని 5-యాంప్ సాకెట్ ద్వారా సులభంగా ఛార్జింగ్ చేసుకునే వీలుంటుందని, ఇంట్లో గానీ, ఆఫీస్, సాధారణ కాఫీ షాపుల వద్ద గానీ ఎక్కడైనా ప్లగ్-ఇన్ వాల్ లాంటి ప్రదేశాల్లో ఛార్జింగ్ చేసుకునే సౌకర్యాలతో అందిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. ఈ బ్యాటరీలో 1200 వాట్ల మోటార్ ఉంటుందని, దీని వల్ల ఇంజిన్ 0-40 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 10 సెకెన్లలో అందుకుంటుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story