King Charles Coronation | ఈ కాలంలో రాచరికం.. పట్టాభిషేకాలు ఏంటని ప్రశ్నించిన ఆందోళనకారులు.. 52 మంది అరెస్టు

ఓ వైపు లండన్‌లో కింగ్ చార్లెస్-III (King Charles) పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరుగుతుంటే, మరోవైపు రాచరిక వ్యవస్థకు వ్యతిరరేకంగా చాలా మంది ఆందోళనలకు దిగారు.

Update: 2023-05-07 19:19 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఓ వైపు లండన్‌లో కింగ్ చార్లెస్-III (King Charles) పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరుగుతుంటే, మరోవైపు రాచరిక వ్యవస్థకు వ్యతిరరేకంగా చాలా మంది ఆందోళనలకు దిగారు. ఈ కాలంలోనూ ఇటువంటివి ఏంటని, రాజు స్థానంలో రాష్ట్రపతి వంటి దేశ నాయకుడిని ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టాలని నినాదాలు చేశారు. పోలీసులు దాదాపు 52 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు.

రాచరికానికి వ్యతిరేకంగా లండన్ లోని ట్రఫాల్గర్ స్క్వేర్ లో ఆందోళన చేయాలనుకున్న వారి ప్రణాళికలను పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో రాచరిక వ్యతిరేక గ్రూపులోని నేతలు కూడా ఉన్నారు. ఈ ఘటనపై పలువురు ఎంపీలు, ఆందోళనకారులు మండిపడ్డారు. తమకు ఉన్న స్వేచ్ఛ, హక్కులను హరిస్తున్నారని అన్నారు.

లండన్ మెట్రోపొలిటన్ పోలీసులు ఈ సందర్భంగా మాట్లాడుతూ… పలు కారణాల వల్ల 52 మందిని అరెస్టు చేశామని, వారందరూ కస్టడీలో ఉన్నారని వివరించారు. రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజల ఆవేదనను అర్థం చేసుకోగలమని, అయితే, తాము చట్టం ప్రకారం పనులు చేస్తామని పోలీసులు అన్నారు.

రాచరిక పద్ధతులకు వ్యతిరేకంగా ఆందోళనకారులను అరెస్టు చేయడం పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో యూకే మంత్రి ఒకరు మాట్లాడుతూ… పట్టాభిషేకం వేళ ఆందోళనలను నియంత్రించడానికి పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. గ్రహం స్మిత్ అనే ఒక ఆందోళనకారుడిని 16 గంటల పాటు కస్టడీలో ఉంచి పోలీసులు విడుదల చేశారు.

విడుదల అయిన తరువాత గ్రహం స్మిత్ మీడియాతో మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా ఇకపై యూకేలో ఉండదా? అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్‌-II (Queen Elizabeth) మరణంతో రాచరిక వ్యవస్థ ముగిసిపోతుందని చాలా మంది భావించారు. అయితే, ఆమె కుమారుడు కింగ్ చార్లెస్ మళ్లీ రాజుగా బాధ్యతలు స్వీకరించడంతో రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న సంఘాలు మండిపడుతున్నాయి.

Also Read: China | పేదరికం గురించి మాట్లాడితే చానెల్ బ్యాన్ తప్పదు.. సోషల్ మీడియాకు చైనా హెచ్చరిక..

Tags:    

Similar News