ఇజ్రాయెల్‌‌కు మరో షాక్.. కీలక నిర్ణయం తీసుకున్న టర్కీ

ఇటీవల కాలంలో మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని ముగించాలని ప్రపంచ దేశాలు కృషి చేస్తున్నాయి.

Update: 2024-05-03 07:41 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల కాలంలో మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని ముగించాలని ప్రపంచ దేశాలు కృషి చేస్తున్నాయి. అయితే ఇజ్రాయిల్ ప్రధాని మాత్రం ఈ విషయంలో ఇంకా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు కూడా క్రమంగా ఇజ్రాయెల్‌తో సంబంధాలను తెగదెంపులు చేసుకుంటున్నాయి. తాజాగా గాజా స్ట్రిప్‌లో పాలస్తీనియన్లపై చేస్తున్న దాడులను నిరసిస్తూ ఇజ్రాయెల్‌తో టర్కీ ప్రభుత్వం అన్ని వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని టర్కీ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

గాజాలో కాల్పులు విరమణ పూర్తయ్యే వరకు ఇజ్రాయెల్‌కు ఎగుమతులపై ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఇజ్రాయెల్ ప్రభుత్వం తన దూకుడు ప్రవర్తనను కొనసాగిస్తోంది, పాలస్తీనాలో మానవతా విషాదం మరింత దిగజారుతున్నట్లుగా ఉందని టర్కీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏప్రిల్‌లో 54 రకాల ఉత్పత్తుల ఎగుమతులను పరిమితం చేయగా, తాజాగా అన్ని ఉత్పత్తుల పరంగా ఇజ్రాయెల్‌తో ఎగుమతి, దిగుమతి లావాదేవీలు నిలిపివేయబడ్డాయి అని ప్రకటనలో పేర్కొంది. ఇటీవల కొలంబియా కూడా కూడా ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను నిలిపివేయగా తాజాగా టర్కీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

తీవ్రంగా దెబ్బతిన్నటువంటి గాజాకు నిరంతరాయంగా, తగినంత మానవతా సహాయాన్ని అందించడానికి ఇజ్రాయెల్ సహకరించనంత వరకు ఈ కొత్త చర్యలను కచ్చితంగా, నిర్ణయాత్మకంగా అమలు చేయనున్నట్లు టర్కీ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య వాణిజ్యం 2023లో $6.8 బిలియన్లకు చేరుకుంది, టర్కీ ఎగుమతుల్లో ఆ దేశం వాటా 76 శాతంగా ఉంది.


Similar News