సునీతా విలియమ్స్‌ రోదసి యాత్రకు మళ్లీ బ్రేక్

భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ రోదసి యాత్ర మే 25న జరగాల్సి ఉండగా వాయిదా పడింది

Update: 2024-05-24 03:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో : భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ రోదసి యాత్ర మే 25న జరగాల్సి ఉండగా వాయిదా పడింది. ఇది జూన్‌ 1 నుంచి 5వ తేదీల్లో జరిగే అవకాశం ఉందని నాసా వెల్లడించింది. సునీతా విలియమ్స్‌తో పాటు మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌ మే 6నే బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో అంతరిక్ష కేంద్రానికి బయలుదేరాల్సి ఉంది. అయితే చివరి క్షణాల్లో ఈ వ్యోమనౌకను మోసుకెళ్లే బోయింగ్‌కు చెందిన అట్లాస్‌ V రాకెట్‌లో సాంకేతికలోపం తలెత్తింది. రాకెట్‌లోని ఆక్సిజన్‌ రిలీఫ్‌ వాల్వ్‌ పనితీరు అసాధారణంగా ఉందని తేలడంతో ప్రయోగాన్ని ఆపేశారు. మే 25న ప్రయోగం చేపడతామని చెప్పినా.. ఈసారి కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. స్టార్ లైనర్ వ్యోమనౌకలోని సర్వీస్‌ మాడ్యూల్‌లో చిన్నపాటి హీలియం లీకేజ్‌ ఉన్నట్లు గుర్తించామని, దాన్ని సరిచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని నాసా తెలిపింది. జూన్‌ 1న మధ్యాహ్నం 12.25 గంటలకు ఈ ప్రయోగం చేపట్టే అవకాశాలున్నాయని.. ఒకవేళ కుదరకపోతే జూన్‌ 2, 5, 6 తేదీల్లో లాంచింగ్‌ చేస్తామని పేర్కొంది. కాగా, స్టార్‌లైనర్‌‌ వ్యోమనౌకతో మానవసహిత యాత్ర నిర్వహించడం ఇదే మొదటిసారి. ఇక, సునీతకు ఇది మూడో అంతరిక్ష యాత్ర. గతంలో ఆమె 2006, 2012లో రోదసిలోకి వెళ్లారు.

Similar News