రోడ్డు కూలిపోయి 19 మంది మృతి: చైనాలో విషాదం

దక్షిణ చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావీన్సులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ప్రావీన్సులోని ఓ హైవేలో కొంత భాగం కూలిపోవడంతో 19 మంది మృతి చెందారు.

Update: 2024-05-01 09:01 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దక్షిణ చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావీన్సులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ప్రావీన్సులోని ఓ హైవేలో కొంత భాగం కూలిపోవడంతో 19 మంది మృతి చెందారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం..మెయిజౌ నగరం, డాబు కౌంటీల మధ్య ఉన్న హైవేలో కొంత భాగం బుధవారం తెల్లవారుజామున 2:10గంటలకు అకస్మాత్తుగా కుంగిపోయింది. దీంతో అటుగా వెళ్తున్న 18 వాహనాలు అందులో చిక్కుకు పోయాయి. ఆ వాహనాల్లో ఉన్న 49 మంది వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాయి. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి 19 మంది మరణించారు.

రెస్య్కూ ఆపరేషన్‌లో సుమారు 500 మంది సిబ్బంది పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు హైవేనీ మూసి వేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీ టీవీ పుటేజీలో రికార్డైంది. రోడ్డు అకస్మా్త్తుగా కుంగి పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. రోడ్డు కూలిపోవడానికి గల కారణాలను అధికారులు వెల్లడించలేదు. అయితే ఇటీవల గ్వాంగ్ డాంగ్ ప్రావీన్సులో భారీ వర్షాలు కురవగా..వరదలు సంభవించాయి. ఈ కారణంగానే హైవే కుంగిపోయినట్టు భావిస్తున్నారు. కాగా, చైనాలో రోడ్డు ప్రమాదాలు సర్వ సాధారణమయ్యాయి. గత మార్చిలోనూ ఉత్తర షాంగ్సీ ప్రావిన్స్‌లోని ఎక్స్‌ప్రెస్‌వే పక్కనే ఉన్న సొరంగంలో బస్సు పడిపోవడంతో 14 మంది మరణించగా.. 37 మంది గాయపడ్డారు.

Tags:    

Similar News