స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తున్నామన్న నార్వే, ఐర్లాండ్, స్పెయిన్

ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాలస్తీనా రాజ్యాన్ని అధికారికంగా గుర్తిస్తామని నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ బుధవారం ప్రకటించాయి.

Update: 2024-05-22 08:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాలస్తీనా రాజ్యాన్ని అధికారికంగా గుర్తిస్తామని నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ బుధవారం ప్రకటించాయి. యుద్ధం వల్ల పదివేల మంది మరణించారు, చాలా మంది గాయపడ్డారు, ఇజ్రాయెల్-పాలస్తీనియన్లకు రాజకీయ పరిష్కారాన్ని అందించే ఏకైక ప్రత్యామ్నాయంగా ఇజ్రాయెల్‌తో శాంతి నెలకొల్పడానికి ఇది సహాయపడుతుందనే ఉద్దేశంతో స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తున్నామని నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరే బుధవారం చెప్పారు.

డబ్లిన్‌లో జరిగిన వార్తా సమావేశంలో ఐరిష్ ప్రధాన మంత్రి సైమన్ హారిస్ మాట్లాడుతూ, పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించాలనే నిర్ణయం ద్వారా చీకట్లో ఉన్న అక్కడి ప్రజలకు ఆశ, ప్రోత్సాహాన్ని అందిస్తుందని అన్నారు. ఈ ప్రకటనల నేపథ్యంలో ఇజ్రాయెల్ ఐర్లాండ్, నార్వే నుండి తన రాయబారులను వెంటనే తిరిగి రావాలని ఆదేశించింది. అలాగే స్పెయిన్‌‌లో తన రాయబారికి కూడా ఇదే ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ దేశాలు పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించడం ద్వారా గాజాలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను తిరిగి ఇచ్చే ప్రయత్నాలను అడ్డుకోవచ్చని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ అన్నారు.

ఐర్లాండ్ ఇటీవలి వారాల్లో ఈ నెలాఖరులోగా పాలస్తీనా రాజ్యాధికారాన్ని గుర్తించే ప్రణాళికలను సూచించింది, కానీ ఇజ్రాయెల్ ఈ బిడ్‌ను గట్టిగా వ్యతిరేకిస్తుంది. ఐర్లాండ్‌ను ఉద్దేశించి X పోస్ట్‌లో , ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ "పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించడం వలన ఈ ప్రాంతంలో మరింత తీవ్రవాదం, అస్థిరత, శాంతి అవకాశాలకు హాని కలుగుతుంది" అని ఆ దేశాన్ని హెచ్చరించింది. అలాగే "హమాస్ చేతిలో పావుగా ఉండకండి" అని అందులో పేర్కొంది. ఈ కొత్త ప్రకటనకు ముందు ఐక్యరాజ్యసమితిలోని 193 సభ్య దేశాలలో 140 కంటే ఎక్కువ పాలస్తీనాను అధికారికంగా గుర్తిస్తున్నాయి.

Similar News