కొండచరియలు విరిగిపడటంతో 100 మందికి పైగా మృతి

పపువా న్యూ గినియాలోని ఓ మారుమూల గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో 100 మందికి పైగా చెందారు

Update: 2024-05-24 08:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పపువా న్యూ గినియాలోని ఓ మారుమూల గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో 100 మందికి పైగా మృతి చెందారు. ఈ విషాదకరమైన ఘటన శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. పసిఫిక్ దేశం అయిన పాపువా న్యూ గినియా రాజధాని పోర్ట్ మోరెస్బీకి వాయువ్యంగా 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎంగా ప్రావిన్స్‌లోని కౌకలం గ్రామంలో ఉదయం కొండచరియలు విరిగిపడ్డాయి. రాత్రి ప్రజలు నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు శిథిలాల క్రింద 100 మంది వరకు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. అయితే అధికారులు ఇంకా మృతుల సంఖ్యను ధృవీకరించలేదు. మృతులు మరింత పెరిగే అవకాశం ఉంది.

చాలా వరకు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే రక్షణ చర్యలు మొదలుపెట్టారు. బండరాళ్లు, శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కార్ సైజు బండరాళ్లు ఇళ్లపైన పడటంతో వాటిని తొలగించడం కష్టంగా ఉంది. భారీ చెట్లు సైతం కొండచరియల తాకిడికి నేలమట్టం అయ్యాయి. తమ బంధువులను కాపాడటానికి స్థానికులు అటూ ఇటూ తిరుగుతున్నారు దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


పపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్ మరాపే ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విపత్తు అధికారులు, PNG డిఫెన్స్ ఫోర్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ వర్క్స్ అండ్ హైవేస్‌ అక్కడికి పంపిస్తున్నాము. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, వెంటనే మౌలిక సదుపాయాల పునర్నిర్మాణాన్ని కూడా ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న ఈ ప్రాంతంలో తరచుగా భారీ వర్షాలు కురుస్తాయి. ఈ ఏడాది భారీ వర్షాలు, వరదలు వచ్చాయి. ఇంతకుముందు మార్చిలో, సమీపంలోని ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 23 మంది మరణించారు.

Similar News