చైనా ఆస్పత్రిలో కత్తితో విచక్షణా రహితంగా దాడి.. ఇద్దరు మృతి, 21 మందికి గాయాలు

చైనాలోని ఆస్పత్రిలో మంగళవారం ఒక వ్యక్తి కత్తితో దాడి చేయగా పలువురు చనిపోగా, 21 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

Update: 2024-05-07 10:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: చైనాలోని ఆస్పత్రిలో మంగళవారం ఒక వ్యక్తి కత్తితో దాడి చేయగా పలువురు చనిపోగా, 21 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. యునాన్‌లోని జెన్‌క్యాంగ్ కౌంటీలోని చెంగ్నాన్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. చైనా ప్రభుత్వ మీడియా సంస్థ పేర్కొన్న దాని ప్రకారం, దుండగుడు కత్తితో ఆసుపత్రిలోకి ప్రవేశించి విచక్షణా రహితంగా దాడి చేశాడు. అడ్డుగా వచ్చిన వారిపై ఎదురుదాడికి దిగాడు. ఒక్కసారిగా అనుకోని సంఘటన జరగడంతో అక్కడి వారు అతని బారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు.

ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో 21 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. గాయ పడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన తాలూకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. దుండగుడు సమీప గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే అరెస్టయిన నిందితుడు దాడికి పాల్పడ్డాడా అనే విషయాన్ని అధికారులు ఇంకా ధృవీకరించలేదు.

సాధారణంగా చైనాలో మరణాయుధాలు కలిగి ఉండటం చట్టవిరుద్ధం. ఈ నేపథ్యంలో ఇలాంటి దాడులు చోటుచేసుకోవడం చాలా అరుదు. కానీ ఇటీవలి సంవత్సరాలలో చైనాలో బహిరంగ ప్రదేశాల్లో కత్తిపోట్ల ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. గత సంవత్సరం, దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌లోని కిండర్ గార్టెన్ బయట తెల్లవారుజామున జరిగిన కత్తి దాడిలో ఆరుగురు మరణించగా, ఒకరు గాయపడ్డారు. 2020లో ఒక ప్రాథమిక పాఠశాలలో జరిగిన కత్తి దాడిలో దక్షిణ గ్వాంగ్జీ ప్రాంతంలో 37 మంది పిల్లలు, ఇద్దరు పెద్దలు గాయపడ్డారు.

Similar News