రఫాలో ఇజ్రాయెల్ దాడి రక్తపాతానికి దారి తీస్తుంది: WHO చీఫ్

రఫా నగరంపై దాడి చేస్తామని ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-05-04 08:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రఫా నగరంపై దాడి చేస్తామని ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ ఆపరేషన్‌‌పై WHO డైరెక్టర్ జనరల్ స్పందించారు. గాజా దక్షిణ నగరమైన రఫాలో ఇజ్రాయెల్ సైనిక చొరబాటు "రక్తపాతానికి" దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు ఏడు నెలల నుంచి కొనసాగుతున్న యుద్ధం కారణంగా చాలా మంది తలదాచుకోడానికి రఫా నగరంలో ఉంటున్నారు. ఇప్పుడు అక్కడ సాధారణ ప్రజలు ఉన్నారు. ఇజ్రాయెల్ ఈ నగరంపై దాడి చేయడం వలన మరింతమంది చనిపోయే అవకాశం ఉంటుంది. అక్కడ ఆశ్రయం పొందుతున్న 1.2 మిలియన్ల మందికి భయంకరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని WHO చీఫ్ హెచ్చరించారు.

ఈ దాడి ఇప్పటికే దెబ్బతిన్న ఆరోగ్య వ్యవస్థను మరింత బలహీనపరుస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇజ్రాయెల్ బాంబు దాడుల కారణంగా ఆరోగ్య సౌకర్యాలు చాలా వరకు దెబ్బతిన్నాయి, కొన్ని పూర్తిగా ధ్వంసమయ్యాయి. గాజాలోని 36 ఆసుపత్రులలో 12, దాని 88 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 22 మాత్రమే "పాక్షికంగా పని చేస్తున్నాయి" అని UN ఆరోగ్య సంస్థ తెలిపింది. ఆరోగ్య సేవలను పునరుద్ధరించడానికి తీవ్రంగా కృషి చేస్తున్న సమయంలో ఇజ్రాయెల్ సైనిక దాడులు రఫాను మరింత కుంగుబాటుకు గురిచేస్తుంది. మానవతా సాయంగా సహాయక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అక్కడి ప్రజలకు ఆహారం, నీరు, మొదలగు మౌలిక సదుపాయాలను అందించడానికి ఇజ్రాయెల్ రఫా నగరంపై దాడులు చేయవద్దని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ విజ్ఞప్తి చేశారు.

Similar News