పాక్ డ్యామ్ ప్రాజెక్ట్ ఆత్మాహుతి దాడి ప్లాన్ ఆఫ్ఘాన్‌లో జరిగింది: పాక్ సైన్యం

మార్చి నెలలో పాకిస్తాన్ డ్యామ్ ప్రాజెక్టులో పనిచేస్తున్న చైనా ఇంజనీర్ల కాన్వాయ్‌పై ఆత్మాహుతి బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే.

Update: 2024-05-07 14:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మార్చి నెలలో పాకిస్తాన్ డ్యామ్ ప్రాజెక్టులో పనిచేస్తున్న చైనా ఇంజనీర్ల కాన్వాయ్‌పై ఆత్మాహుతి బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే. దీంతో దీనిపై దర్యాప్తు మొదలుపెట్టిన అధికారులు తాజాగా దాడికి సంబంధించిన వివరాలను ప్రకటించారు. ఈ దాడి గురించిన ప్లాన్ మొత్తం కూడా ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిందని తెలిపారు, అలాగే ఆత్మాహుతి దాడి చేసిన నిందితుడు కూడా ఆ దేశ జాతీయుడే అని, దాడిలో ఉపయోగించిన కారు కూడా ఆఫ్ఘనిస్తాన్‌లో తయారు చేయబడిందని పాకిస్తాన్ సైన్యం మంగళవారం తెలిపింది.

పాక్ మిలటరీ ప్రతినిధి మేజర్ జనరల్ అహ్మద్ షరీఫ్ ఇస్లామాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ముందుగా ఈ దాడికి మొత్తం ప్లాన్‌ను ఆఫ్ఘనిస్తాన్‌లో తయారుచేసుకున్నారని తెలిపారు. చైనా ఇంజనీర్లను లక్ష్యంగా చేసుకుని కుట్ర పన్నిన నలుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేసినట్లు షరీఫ్ తెలిపారు. పాకిస్థాన్‌లోని 29,000 మంది చైనా పౌరులు ఉన్నారు, అందులో 2,500 మంది CPEC ప్రాజెక్టులపై, 5,500 మంది ఇతర అభివృద్ధి ప్రాజెక్టులపై పనిచేస్తున్నారు, వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆయన తెలిపారు.

గత కొన్ని నెలలుగా పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. గత సంవత్సరం, పాకిస్తాన్ దాదాపు 370,000 మంది పత్రాలు లేని ఆఫ్ఘన్ జాతీయులను బహిష్కరించింది. మార్చిలో వాయువ్య పాకిస్థాన్‌లో డ్యామ్ ప్రాజెక్టులో పనిచేస్తున్న చైనా ఇంజనీర్ల కాన్వాయ్‌పైకి ఆత్మాహుతి బాంబర్ వాహనం ఢీకొట్టడంతో ఆరుగురు మరణించారు. దీంతో ప్రాజెక్ట్‌‌లో పనిచేయడానికి చైనా జాతీయులు ఆసక్తి చూపించడం లేదు. భద్రత పరంగా పాక్ ప్రభుత్వం పూర్తి హమీ ఇచ్చినట్లయితే పనుల్లో పాల్గొంటామని కొద్ది రోజుల క్రితం స్పష్టం చేశారు.

Similar News