ఇండోనేషియాలో భారీ భూకంపం..6.5తీవ్రతగా నమోదు

ఇండోనేషియాలోని జావా ద్వీపం తీరంలో శనివారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతగా నమోదైనట్టు ఆ దేశ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Update: 2024-04-28 03:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇండోనేషియాలోని జావా ద్వీపం తీరంలో శనివారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతగా నమోదైనట్టు ఆ దేశ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భూమిలోపల 68 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రీకృతమై ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ ఏజెన్సీ తెలిపింది. భూకంపం వల్ల జావా ద్వీపం అంతటా బలమైన ప్రకంపనలు సంభవించాయి. అలాగే రాజధాని జకార్తా, బాండుంగ్‌లోనూ ప్రకంపనలు రాగా పలు భవనాలు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. అయితే ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను ఇండోనేషియా ప్రభుత్వం వెల్లడించలేదు.

సాధారణంగా భూప్రకంపనలు 5 సెకన్ల పాటు కొనసాగుతాయి..కానీ ప్రస్తుతం ఇండోనేషియాలో సంభవించిన భూకంపం వల్ల ప్రకంపనలు 10 నుంచి 15 సెకన్ల పాటు కొనసాగినట్టు అధికారులు తెలిపారు. భూకంపం వల్ల సునామీ ప్రమాదం లేకపోవడంతో ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. ఇండోనేషియా ఒక విస్తారమైన ద్వీపసమూహం. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌పై దాని స్థానం ఉండటం కారణంగా తరచుగా భూకంపాలు వస్తుంటాయి. ఈ నెల 17న ఇండోనేషియాలోని రుయాంగ్ పర్వతంపై అగ్నిపర్వత విస్ఫోటనం జరిగిన విషయం తెలిసిందే.

కాగా, 2022లోనూ జావా ద్వీపంలో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని కారణంగా, సియాంజూర్ నగరంలో ఆరు వందల మందికి పైగా మరణించారు. 2018లో సులవేసిలోని పాలూలో భూకంపం, సునామీ కారణంగా 2200 మందికి పైగా మృతి చెందారు. అలాగే 2004లో అచే ప్రావిన్స్‌లో 9.1 తీవ్రతతో సంభవించిన భూకంపం సునామీకి కారణమైంది. ఈ సందర్భంలోనూ భారీగా మరణాలు చోటుచేసుకున్నాయి.

Tags:    

Similar News