చైనాలో దారుణ ఘటన.. కత్తితో దాడి చేసి 8 మందిని చంపిన వ్యకి

చైనాలో ఇటీవల కాలంలో సామూహిక నేరాలు తరుచుగా జరుగుతున్నాయి.

Update: 2024-05-24 08:53 GMT

దిశ, నేషనల్ బ్యూరో: చైనాలో ఇటీవల కాలంలో సామూహిక నేరాలు తరుచుగా జరుగుతున్నాయి. తాజాగా ఒక వ్యక్తి కత్తితో దాడి చేసి 8 మందిని చంపిన ఘటన చోటు చేసుకుంది. సెంట్రల్ చైనాలో హుబేయ్ ప్రావిన్స్‌లోని జియోగాన్ నగరంలో లూ అనే పేరు కలిగిన 53 ఏళ్ల వ్యక్తి కత్తితో విచక్షణా రహితంగా కొంతమందిపై దాడి చేశాడు. ఈ ఘటనలో 8 మంది చనిపోగా, ఒకరు గాయపడినట్లు స్థానిక అధికారులను ఉటంకిస్తూ అక్కడి మీడియా శుక్రవారం నివేదించింది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు గతంలో మానసిక అనారోగ్యానికి సంబంధించిన చికిత్స పొందాడని అధికారులు తెలిపారు. దాడి చేసిన నిందితుడిని ప్రస్తుతం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

సాధారణంగా చైనాలో సామూహిక హింసాత్మక నేరాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అక్కడి పౌరులు తుపాకీలు లేదా ఇతర మరణాయుధాలు కలిగి ఉండటం నిషేధం. దీనిని ఎవరైనా ఉల్లంఘిస్తే ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుంది. కానీ ఇటీవల కాలంలో అక్కడ తరుచుగా ఇలాంటి నేరాలకు సంబంధించిన ఘటనలు జరుగుతున్నాయి. ఈ మధ్య సెంట్రల్ జియాంగ్జి ప్రావిన్స్‌లోని ఒక ప్రాథమిక పాఠశాలలో పండ్ల కత్తితో ఒక మహిళ ఇద్దరు వ్యక్తులను చంపింది, ఇదే ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు. ఇదే నెలలో, నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లోని ఒక ఆసుపత్రిలో ఒక వ్యక్తి కత్తితో దాడికి దిగాడు. ఆసుపత్రిలో ఉన్నటువంటి పలువురిపై దాడి చేశాడు. అడ్డుకోవడానికి వచ్చిన వారిపై సైతం కత్తితో బెదిరించాడు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో అక్కడ ఉన్నవారంత కూడా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, 21 మంది గాయపడ్డారు.

Similar News