అదురులేదు.. బెదురులేదు.. శ్మశానమే ‘ఆమె’కు జీవనాధారం
దిశ ప్రతినిధి, ఖమ్మం : శ్మశానం.. బంధాలు తెగిన తర్వాత అందరమూ వెళ్లాల్సిన ప్రదేశం అని తెలిసినా అదంటేనే ఏదో తెలియని భయం.. ఆ ఊసెత్తితేనే వణుకు.. ఎంతటి వారైనా అటుగా వెళ్లడానికి జంకు… పగటి వేళ అయితే ఎలాగోలా వెళ్లొచ్చు.. అదే రాత్రి అయితే అంతే సంగతులు.. దరిదాపుల్లోకి కూడా వెళ్లలేం.. మగవారికే ముచ్చెమటలు పట్టే శ్మశాన వాతావరణంలో ఓ మహిళా కాటి కాపరి వృత్తిని నిర్వర్తించడం మామూలు విషయం కాదు.. రాత్రి వేళ సైతం […]
దిశ ప్రతినిధి, ఖమ్మం : శ్మశానం.. బంధాలు తెగిన తర్వాత అందరమూ వెళ్లాల్సిన ప్రదేశం అని తెలిసినా అదంటేనే ఏదో తెలియని భయం.. ఆ ఊసెత్తితేనే వణుకు.. ఎంతటి వారైనా అటుగా వెళ్లడానికి జంకు… పగటి వేళ అయితే ఎలాగోలా వెళ్లొచ్చు.. అదే రాత్రి అయితే అంతే సంగతులు.. దరిదాపుల్లోకి కూడా వెళ్లలేం.. మగవారికే ముచ్చెమటలు పట్టే శ్మశాన వాతావరణంలో ఓ మహిళా కాటి కాపరి వృత్తిని నిర్వర్తించడం మామూలు విషయం కాదు.. రాత్రి వేళ సైతం ఒక్కతే ఎంతో ధైర్యంగా విధులను నిర్వర్తిస్తూ ముందుకు సాగుతున్న ఆ ‘అరుణ’ ధైర్యానికి హ్యాట్సాప్..
ముత్యాల శ్రీనివాసరావు.. అరుణ భర్త.. ఇద్దరు పిల్లలు.. భద్రాచలం వైకుంఠధామంలో కాటికాపరిగా పనిచేసేవాడు. శవాలను దహనం చేసే సమయంలో ఆయనకు చేదోడు వాడోదుడుగా అరుణ ఉండేది. మద్యానికి బానిసైన శ్రీనివాసరావు లివర్ ఫెయిల్యూర్ అయి కొంతకాలం కిందట చనిపోయాడు. ఏం చేయాలో తెలియని అరుణ భర్త వృత్తి అయినా కాటికాపరిగానే స్థిరపడిపోయారు. తను బతకడమేకాదు.. మరికొంత మంది అనాథలను చేరదీసి బాగోగులనూ చూస్తోంది. శ్మశానం అంటే మగవాళ్లు సైతం భయపడే పరిస్థితి కానీ మహిళ కాటి కాపరిగా బతుకడం మామూలు విషయం కాదు. ఆమె అలా బతకడమే కాకుండా పదిహేను మందిని సాదుతూ బాగోగులు చూసుకుంటోంది. భద్రాచలంలోని వైకుంఠ ధామంలో కాటికాపరిగా పనిచేస్తున్న అరుణను మహిళా దినోత్సవం సందర్భంగా ‘దిశ ప్రతినిధి’ పలుకరించగా పలు విషయాలను బరువెక్కిన హృదయంతో వెల్లడించింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే…
‘‘నేను బతకాలి.. నాతో ఉన్న వాళ్లనూ బతికించాలి.. నా పేదరికమే నా గుండె ధైర్యం.. బతికున్నోళ్లకంటే చనిపోయిన వాళ్లే మంచోళ్లు.. శ్వాస ఉన్నంత వరకే ఏ బంధుత్వమైనా.. ఊపిరి పోతే అంతే.. శ్మశానం చాలా నేర్పింది.. భర్త ఉన్నప్పుడు శవాలకు దహన సంస్కారాలు, అంత్యక్రియలు చేసేటప్పుడు చూసే దాన్ని. అప్పుడప్పుడు ఆయన తాగి పడుకుంటే ఒక్కదాన్నే ఆ కార్యక్రమాల్ని పూర్తి చేసేదాన్ని. దాంతో భయం లేకుండా పోయింది. కొంత కాలం కిందట ఆయన చనిపోయాడు. ఏం చేయాల్నో తెలియని స్థితిలో అదే వృత్తిని నమ్ముకున్నా. భర్త చనిపోయాక 16 రోజులు తిరగక ముందే మా ఆర్థిక పరిస్థితి బాగోలేక శవాలకు దహనం చేయడం మొదలు పెట్టాను. అప్పుడు ఎంతో మంది నన్ను చీదరించుకున్నారు. కానీ ఒక్కదాన్నయితే ఖాళీ కడుపుతో పడుకునే దాన్ని. నాతో పాటు నా పిల్లలు.. నేను పెంచుకుంటున్న వాళ్లు కూడా ఉన్నారు కదా.. అందుకే దహన సంస్కారాలు చేసుకుంటూ వచ్చేదాన్ని.. ఎవరు ఏమన్నా శ్మశానమే నాకు అన్నీ.. ’’ అంటూ తెలిపింది.
శవాలు పైకి లేచేవి..
‘‘మధ్యరాత్రి సమయంలో కూడా శవాలను తీసుకుని దహనం చేయమని వచ్చేవారు. అలాంటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేదాన్ని. వారు ఇచ్చేదానితోనే కదా గడిచేది. ఒక్కరోజు మూడు నాలుగు శవాలు కూడా వస్తుంటాయి. కొన్ని అనాథ శవాలు కుళ్లిపోయిన స్థితిలో వస్తుంటాయి. ఒక్కోసారి దహనం చేస్తుంటే కొంత కాలిన తర్వాత శవాలు పైకి లేస్తాయి. మాంసపు ముద్దలు ఎగిరిపడుతుంటాయి అయినా భయపడకుండా పని పూర్తి చేశాక పడుకుంటాను.’’ అని బాధ్యతను వివరించింది.
కొవిడ్ టైంలో బాధేసింది..
‘‘ కొవిడ్ టైంలో ఎన్నో కొవిడ్ శవాలు తీసుకొచ్చి దహనం చేయమనేవారు. మొదటి సారి ఒకతను తన భార్య శవాన్ని అంబులెన్స్ లో తీసుకొచ్చి కనీసం ముట్టుకోకుండానే దహనం చేయమన్నాడు. అప్పుడు నేను షాక్ అయ్యాను. తర్వాత ఓ తండ్రి కొడుకు శవాన్ని తీసుకొచ్చి అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఇంకోసారేమో ఎవరో తెలియదు శ్మశానం బయటే శవాన్ని వదిలేసి వెళ్లిపోయారు.. ఇలాంటి ఎన్నో ఘటనలు చూశాను. అయినా వారందరికీ దహన సంస్కారాలు నిర్వహించాను. కానీ ఈ టైంలోనే బంధుత్వం ఏంటి అనేది తెలిసింది. ప్రాణం పోయినాక ఎవరికి ఎవరూ కారు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు కొందరైతే శవాన్ని పెట్టి డబ్బుల కోసం తగువులాడుకున్న ఘటనలూ చూశాను..’’ అంటూ అరుణ తనకు ఎదురైన అనుభవాలను వివరించింది.
డబ్బులు సరిపోవడం లేదు..
‘‘ కాటికాపరిగా ఉన్నందుకు పంచాయతీ నుంచి రూ.7,500 జీతం వస్తుంది. ఏమాత్రం సరిపోదు. కాల్చేందుకు కట్టెలు, డీజిల్, కిరోసిన్ కే పోతాయి. ఇక శవాన్ని దహనం చేస్తే వెయ్యి, పదిహేను వందలు ఇస్తారు. కొంతమంది అయితే రూ.500 చేతులో పెడతారు, ఇంకొందరైతే డబ్బులు ఇచ్చేందుకు వాళ్లలో వాళ్లే గొడవ పెట్టకుంటారు. ఇలాంటి ఘటనలు చూస్తే బాధేస్తుంది. అలాంటోళ్ల దగ్గర డబ్బులు తీసుకోకుండానే శవాలకు దహనం చేస్తాను. వచ్చిన మొత్తంతో నాతో పాటే మరో పదిహేను మంది బాగోగులు నేనే చూడాలి. ఈ డబ్బులు ఏమాత్రం సరిపోవడం లేదు.. ప్రభుత్వం ఎలాగైనా ఆదుకుంటే బాగుంటుంది” అని బరువెక్కిన హృదయంతో బాధను పంచుకుంది.