West Bengal CS Alapan Bandyopadhyay : బెంగాల్ సీఎస్ పదవీ విరమణ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న ఘర్షణపూరిత వాతావరణంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బంధోపాధ్యాయ్ సోమవారం పదవీ విరమణ చేశారు. అనంతరం ఆయనను సీఎం మమతా బెనర్జీ తన ప్రధాన సలహాదారుగా నియమించుకున్నారు. ఈ నిర్ణయాలన్నీ శరవేగంగా జరిగిపోయాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బంధోపాధ్యాయ్ పదవీ కాలాన్ని మరో మూడునెలలు కొనసాగించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఆయన తిరస్కరించారని, ఇదే రోజు ఆయన పదవీ విరమణ చేశారని సీఎం మమతా […]

Update: 2021-05-31 10:48 GMT

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న ఘర్షణపూరిత వాతావరణంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బంధోపాధ్యాయ్ సోమవారం పదవీ విరమణ చేశారు. అనంతరం ఆయనను సీఎం మమతా బెనర్జీ తన ప్రధాన సలహాదారుగా నియమించుకున్నారు. ఈ నిర్ణయాలన్నీ శరవేగంగా జరిగిపోయాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బంధోపాధ్యాయ్ పదవీ కాలాన్ని మరో మూడునెలలు కొనసాగించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఆయన తిరస్కరించారని, ఇదే రోజు ఆయన పదవీ విరమణ చేశారని సీఎం మమతా బెనర్జీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు.

కరోనా కాలంలో విశేష సేవలందించిన ఆలాపన్ సచివాలయంలో ఉండాల్సిన అవసరముందని, అందుకే సీఎం చీఫ్ అడ్వైజర్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించారు. మంగళవారం నుంచి ఆయన ప్రధాన సలహాదారుగా సేవలందిస్తారని తెలిపారు. తదుపరి ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర హోం సెక్రెటరీ హరిక్రిష్ణ ద్వివేదిని నియమిస్తున్నట్టు సీఎం వివరించారు. రాష్ట్ర హోం శాఖ కార్యదర్శిగా బీపీ గోపాలికను నియమిస్తు్న్నట్టు వెల్లడించారు. మే 31న రిటైర్ కావాల్సిన ఆలాపన్‌ను మరో మూడు నెలలు సీఎస్‌గా కొనసాగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను కేంద్రం ఇటీవలే ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆమోదం తెలిపిన నాలుగు రోజులకే సెంట్రల్ డిప్యుటేషన్‌పై రీకాల్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

యాస్ తుపాను కల్లోలాన్ని సమీక్షించడానికి రాష్ట్రానికి వచ్చిన పీఎం మోడీతో భేటీలో సీఎం బెనర్జీ పూర్తిస్థాయిలో పాల్గొనలేదు. ఆమెతోపాటే అప్పటి ప్రధాన కార్యదర్శి ఆలాపన్ కూడా భేటీ నుంచి వెళ్లిపోయారు. అనంతరం, గంటల వ్యవధిలోనే బెంగాల్ సీఎస్ ఆలాపన్‌ను సెంట్రల్ డిప్యూటేషన్‌పై కేంద్రం రీకాల్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 31లోగా ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలపై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. బ్యూరోక్రాట్లని బాండెడ్ లేబర్లుగా కేంద్రం భావిస్తున్నదని, ఇది దేశంలోని ఉన్నతాధికారులందరికీ అవమానమని విమర్శించారు.

రీకాల్ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కోరారు. సోమవారమూ మరో లేఖ రాసి ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఈ లేఖ రాసిన వెంటనే కేంద్రం మరోసారి రీకాల్ లెటర్‌ను కేంద్రం పంపింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం హిట్లర్, స్టాలిన్‌లా వ్యవహరిస్తున్నదని, రాష్ట్రాల అభ్యర్థలను ఆలకించడం లేదని దీదీ విమర్శించారు. అనంతరం కీలక ప్రకటన చేశారు. కాగా, కేంద్రం ఆదేశాలను ఉల్లంఘించిన ఆలాపన్‌పై చర్యలు తీసుకుంటారని కేంద్ర ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి. చార్జిషీట్ కూడా దాఖలయ్యే అవకాశముందని తెలిపాయి.

Tags:    

Similar News