పిల్లులు పాలించే ద్వీపం.. అక్కడి ప్రజలు వాటిని పూజిస్తారు..

సాధారణంగా దేశాన్ని, రాజ్యాలను మనుషులు పాలిస్తారు.

Update: 2024-05-27 09:00 GMT

దిశ, ఫీచర్స్ : సాధారణంగా దేశాన్ని, రాజ్యాలను మనుషులు పాలిస్తారు. కానీ ఓ ద్వీపాన్ని పిల్లులు పాలిస్తున్నాయట. అంతే కాదు అక్కడ ఉన్న ప్రజలు పిల్లులని దేవునిలా పూజిస్తారట. వింటుంటే చాలా వింతగా, ఆశ్చర్యంగా ఉంది కదా. ఇంతకీ ఈ ద్వీపం ఎక్కడ ఉంది అంటే జపాన్ ఈశాన్య భాగంలో ఉన్న తాషిరోజిమా ద్వీపం. ఇక్కడ మానవుల కంటే ఎక్కువ పిల్లులు నివసిస్తాయి. ఇక్కడ ఊహించని విధంగా పిల్లులు రక్షకుల పాత్రను పోషిస్తున్నాయి. ఇక్కడ పిల్లుల గౌరవార్థం 'నెకో నింజా' అనే ఆలయం కూడా ఉంది. ఇక్కడ ద్వీపవాసులు, పిల్లుల మధ్య అందమైన బంధాన్ని చూపిస్తారు.

చారిత్రాత్మకంగా చెప్పాలంటే తాషిరోజిమా పట్టు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. అప్పుడు రైతులు తమ విలువైన పట్టుపురుగులను ఎలుకల నుండి రక్షించుకోవడానికి పిల్లులను ఉంచారు. అంతే కాదు పిల్లులు అదృష్టాన్ని తెస్తాయని, ఎక్కువ చేపలను పట్టుకోవడంలో సహాయపడతాయని ఇక్కడి మత్స్యకారులు నమ్ముతారు.

ఈ ఆలయం ఎలా నిర్మించారు..

ఇండిపెండెంట్ నివేదిక ప్రకారం మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే ముందు వాతావరణాన్ని అంచనా వేయడానికి పిల్లుల కదలికల పై నిఘా ఉంచేవారని చెబుతున్నారు. తరతరాలుగా ఇక్కడ నివసించే మనుషులకు, పిల్లులకు మధ్య ఉన్న అనుబంధం చాలా మంచిదని చెబుతారు. ఒకసారి ఒక మత్స్యకారుడు ప్రమాదవశాత్తు పిల్లిని గాయపరిచాడు. ఆ తర్వాత ద్వీపవాసులు కలిసి పిల్లి గౌరవార్థం ఆలయాన్ని నిర్మించారు. ఈ సంఘటన తర్వాత పిల్లి, ద్వీపవాసుల మధ్య బంధం మరింత బలపడింది.

ప్రత్యేక సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతోంది..

ఈ ద్వీపం తోహోకు ప్రాంతంలో ఉన్న మియాగి ప్రిఫెక్చర్‌లోని ఇషినోమాకి నగరంలో భాగం. 2011లో భయంకరమైన భూకంపం తర్వాత వినాశకరమైన సునామీని చూసింది. అయినప్పటికీ ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పటికీ ద్వీపం ప్రత్యేక సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతోంది.

మనుషుల కంటే ఎక్కువ పిల్లులు..

నివేదిక ప్రకారం నేడు తాషిరోజిమా ద్వీపంలో 100 కంటే ఎక్కువ పిల్లులు ఉన్నాయి. ఇక మనుషుల విషయానికొస్తే 50 మంది నివసిస్తున్నారు. శాంతియుత వాతావరణంలో తాషిరోజిమా మానవులు, పిల్లుల మధ్య శాశ్వతమైన సంబంధానికి నిదర్శనంగా మిగిలిపోయింది.

Tags:    

Similar News