ప్రశ్నిస్తేనే.. మార్పు!
దిశ, ఫీచర్స్ : దేశాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా లింగ వివక్ష ప్రతి చోట చాప కింద నీరులా
దిశ, ఫీచర్స్ : దేశాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా లింగ వివక్ష ప్రతి చోట చాప కింద నీరులా ప్రవహిస్తూనే ఉంది. ప్రపంచ దేశాలు ప్రవేశపెట్టిన సంస్కరణలు, అమలు చేస్తున్న చట్టాలు మహిళా సాధికారతకు మద్దతునిస్తున్న.. సొసైటీ మెదళ్ల నుంచి స్టీరియోటైప్స్‌ను దూరం చేయలేకపోతున్నాయి. ఆలోచనా విధానంలో మార్పు రానంత వరకు లింగ సమానత్వానికి ఆచరణలో అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయన్న స్పృహను కలిగిస్తున్నాయి. రాజకీయ, వాణిజ్య సాంస్కృతిక రంగాల్లో కొందరు మహిళలు రాణిస్తున్న.. క్షేత్రస్థాయి ముఖచిత్రాన్ని పరిశీలిస్తే లింగ పక్షపాతాలు సాధారణ జీవితాల్లో ఎంత లోతుగా పాతుకుపోయాయో అర్థమవుతోంది. ఈ క్రమంలో ఆడుకునే బొమ్మల నుంచి అంతర్జాతీయ క్రీడల వరకు అడుగడుగునా ఆంక్షలు కొనసాగుతుండగా.. ఇప్పటికీ చెలామణిలో ఉన్న కొన్ని సాధారణ లింగ పక్షపాతాలు, స్టీరియో టైప్స్ గురించి..
పక్షపాతం(bias), మూస పద్ధతి(stereotype).. ఈ రెండు పదాలను ఇంచుమించు ఒకే సందర్భానికి పడుతున్నప్పటికీ కొంచెం తేడాలున్నాయి. పక్షపాతం అనేది వ్యక్తిగత ప్రాధాన్యత, ఇష్టం లేదా అయిష్టానికి సంబంధించినది. ఇక మూస పద్ధతి విషయానికొస్తే.. ఒక తరగతి లేదా గ్రూప్‌లోని సభ్యులందరికీ నిర్దిష్ట లక్షణాలను(సాధారణంగా) ఆపాదించే ముందస్తు ఆలోచన. స్త్రీ, పురుషుల వ్యక్తిగత సామర్థ్యాలను పెంచుకోవడం, ప్రొఫెషనల్ కెరీర్‌ను కొనసాగించడం లేదా వారి జీవితంలో నచ్చిన విషయాన్ని ఎంపిక చేసుకునే సామర్థ్యాన్ని పరిమితం చేసినప్పుడు జెండర్ స్టీరియోటైప్ హానికరంగా మారుతుంది. దాదాపు 90 శాతం మంది పురుషులు, మహిళలు.. స్త్రీల పట్ల ఒకే విధమైన పక్షపాతాన్ని కలిగి ఉన్నారని UN కొత్త నివేదిక కనుగొంది.
కొన్ని కామన్ స్టీరియో టైప్స్, పక్షపాతాలు :
* ఆడపిల్లలు గులాబీ రంగు దుస్తులే ధరించాలి, బొమ్మలతోనే ఆడుకోవాలి.
* మంచి ప్రవర్తన కలిగి ఉండి, ఎదురు మాట్లాడకూడదు.
* అందంగా కనిపించడమే కాకుండా ఇంటి పనులు నేర్చుకోవాలి.
వర్క్ విషయంలో..
* ఉద్యోగం చేసే హక్కు మహిళల కంటే తమకే ఎక్కువని ప్రపంచంలోని 50 శాతం పురుషుల భావన.
* మహిళలు ప్రొఫెషనల్ లైఫ్‌కు కాకుండా ఇంటి బాధ్యతలకే ప్రాధాన్యతివ్వాలి.
* సేఫ్ జాబ్స్, సురక్షిత రంగాల్లోనే కెరీర్‌ను ఎంచుకోవాలి.
మానసిక ఆరోగ్యంలో..
* ఎక్కువ మంది స్త్రీలు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు(చిన్న చిన్న సమస్యలు లేదా శారీరక వివరణ లేని సమస్యలు).
* చిరాకు కలిగించే భాగస్వాముల ప్రవర్తన కారణంగా PMS (ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్) ఫేస్ చేస్తున్నారు.
* ప్రసవానంతర సమస్యలు స్త్రీలకు సహజమైనవి గా పరిగణించబడుతున్నాయి.
* ఏడుపులు, ఫిర్యాదులు స్త్రీలకు సంబంధించినవే. ఇవి పురుషులకు సరిపడవనే దృక్పథం.
పక్షపాత ధోరణిని ఎలా బ్రేక్ చేయవచ్చు?
* ప్రశ్నించడం మొదలెట్టాలి : ప్రశ్నించడంతోనే మార్పు మొదలవుతుంది. మన సొంత పక్షపాతాన్ని గుర్తించి, చుట్టుపక్కల మహిళలను అది ఎలా ప్రభావితం చేస్తుందో పరిశీలించినపుడే పక్షపాత వైఖరిని సవాల్ చేసే సామర్థ్యం పెంపొందుతుంది.
* కొత్త తరానికి అవగాహన కల్పించాలి : 'ఇంటి పనులు అమ్మాయిలకే' అనే విషయంలో అబ్బాయిలకు, 'మ్యాన్లీ వర్క్స్' విషయంలో అమ్మాయిలకు అవగాహన కల్పించేందుకు సమయం వెచ్చించాలి. కలర్ కోడింగ్ వదిలేసి ఆడ, మగ వ్యత్యాసం లేకుండా సమానత్వంతో పెరిగే తరాన్ని వృద్ధి చేయాలి.
* దేనికైనా సమానత్వమే : మహిళలే కాదు, పురుషుల సమస్యలను ముందుకు తీసుకురావడం ద్వారా లింగ సమానత్వం పురుషులకు కూడా ఉంటుందని చాటి చెప్పాలి. అప్పుడే అణచివేతలు లేని ఈక్వల్ వరల్డ్‌ను సృష్టించగలం.
* స్త్రీలు ఒకరికి ఒకరు వెన్నుదన్నుగా : మహిళలు.. తమ తోటి మహిళలను ఉద్ధరించగలరు. అయితే పిల్లలను మహిళలే పెంచాలి, ఇంట్లో వంటకు పరిమితమవ్వాలనే సాంస్కృతిక పక్షపాతాలను నివారిస్తే అన్ని రంగాల్లోనూ ఇది సాధ్యపడుతుంది.
* నియామకం : పనిలో ఎక్కువ మంది మహిళా సిబ్బందిని నియమించుకుని.. లింగ ఆధారితంగా కాక పని ఆధారంగా ప్రోత్సాహకాలు అందించాలి.
* మిక్స్‌డ్ స్పోర్ట్స్ : స్త్రీ, పురుషులకు వేర్వేరుగా కాకుండా ఒకే జట్టుగా క్రీడలు నిర్వహిస్తే సత్తా చూపగలరనే చర్చ కూడా ప్రచారంలో ఉంది.