శ్రీలంకకు తిరిగి రానున్న మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సే

దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంకలో సంక్షోభం తీవ్రతరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజల నిరసనలు ఆకాశాన్నంటాయి..

Update: 2022-07-26 14:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంకలో సంక్షోభం తీవ్రతరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజల నిరసనలు ఆకాశాన్నంటాయి. దాంతో శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి వెళ్లిపోయారు. అయితే అతడు శ్రీలంకను విడిచి పారిపోయారని అనేక వార్తలు వచ్చాయి. అయితే శ్రీలంక మంత్రి మంగళవారం సంచలన విషయం వెల్లడించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన శ్రీలంక మీడియా మంత్రి బందుల గోనవర్దేన ఈ మేరకు విషయం తెలిపారు. గోటబయ రాజక్స సింగపూర్‌లో తలదాచుకున్నారని, త్వరలో శ్రీలంకకు తిరిగి వస్తారని ఆయన వెల్లడించారు. 'మాజీ అధ్యక్షుడు సింగపూర్‌లో దాక్కున్నారంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆయన అధికార నిబంధనలన్నింటినీ పాటించి, అధికారిక వీసా ద్వారానే సింగపూర్‌కు వెళ్లారు. ఆయన తిరిగి వస్తారని నాకు నమ్మకం ఉంది. అంతేకాకుండా మాజీ అధ్యక్షుడికి ఎటువంటి హాని జరగకుండా శ్రీలంక అధికారులు చర్యలు తీసుకుంటారు' అని మంత్రి బందుల తెలిపారు. వీరితో పాటుగా శ్రీలంక పొదెజన పెరామున (ఎస్ఎల్‌పీపీ) పార్టీ చైర్మణ్ జీఎల్ పీరిస్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. 2019 అధ్యక్ష పదవి ఎన్నికలు గెలిచేందుకు ఈ పార్టీ రాజక్సలతో ఏర్పాటు చేయబడిందని ఆయన అన్నారు. దాంతో పాటుగా గోటబయ రాజపక్స శ్రీలంకకు ఖచ్ఛితంగా తిరిగి వస్తారని, ఆయన మాజీ దేశాధినేతలకు రావాల్సిన అన్ని ప్రోత్సహకాలు, అధికారాలకు పూర్తి అర్హులని పీరిస్ అన్నారు.

Similar News