ప్రపంచవ్యాప్తంగా మానవ చెత్తలో జీవిస్తున్న పక్షులు
ప్రపంచవ్యాప్తంగా అంటార్కిటికా మినహా ప్రతి ఖండంలోని పక్షులు మానవులు వదిలేసిన చెత్తలో గూడు కట్టుకోవడం లేదా అందులోనే చిక్కుకుపోవడాన్ని అనేక ఫొటోలు వివరిస్తున్నాయి.
దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా అంటార్కిటికా మినహా ప్రతి ఖండంలోని పక్షులు మానవులు వదిలేసిన చెత్తలో గూడు కట్టుకోవడం లేదా అందులోనే చిక్కుకుపోవడాన్ని అనేక ఫొటోలు వివరిస్తున్నాయి. తాళ్లు, ఫిషింగ్ లైన్ నుంచి బెలూన్ రిబ్బన్స్, ఫ్లిప్-ఫ్లాప్ వరకు రకరకాల చెత్త పక్షుల ఆవాసాలకు వేదికగా నిలుస్తోందని 'బర్డ్స్ అండ్ డెబ్రిస్' ఆన్‌లైన్ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్న శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రపంచ నలుమూలల నుంచి అనేక ఫొటోలు సమర్పించబడ్డాయి. వీటిలో దాదాపు నాలుగింట ఒక వంతు ఛాయా చిత్రాలు.. పునర్వినియోగపరచలేని ఫేస్ మాస్క్‌లలో పక్షులు చిక్కుకున్నట్లుగా చూపుతున్నాయి.
పక్షుల ప్రపంచంపై ప్లాస్టిక్ కాలుష్యానికి సంబంధించిన వ్యర్థాలు చూపిస్తున్న ప్రభావాన్ని క్యాప్చర్ చేయడంపై ఈ ప్రాజెక్ట్ దృష్టిసారించింది. 'ప్రాథమికంగా సముద్రపు పాచి, కొమ్మలు లేదా రెల్లు గడ్డి వంటి పొడవాటి పీచు పదార్థాలను ఉపయోగించి పక్షి గూడును నిర్మిస్తే.. అందులో ఎక్కడో ఒకచోట మానవ శిథిలాలు ఉండే అవకాశం ఉంది' అని లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియంకు చెందిన పరిశోధకుడు డాక్టర్ అలెక్స్ బాండ్ చెప్పారు. నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్న తమ బృందం.. పర్యావరణంలో ప్లాస్టిక్ వ్యర్థాల విస్తృత సమస్యపై అందరి దృష్టిని ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఇది నిజంగా ప్రపంచ సమస్యగా మారింది. ఇటీవలి అధ్యయనంలో పరిశోధకుల బృందం అందజేసిన ఫొటోల్లో మహమ్మారి సంబంధిత వ్యక్తిగత రక్షణ పరికరాలు(PPE) ఎన్ని ఉన్నాయో పరిశీలించారు. చాలా వరకు పక్షుల శరీరాలకు మాస్క్‌లు కనబడ్డాయి. వాటిలోని ఎలాస్టిక్ కాళ్లకు, ముక్కుకు చుట్టుకుని గాయపడటాన్ని కూడా గమనించామని డాక్టర్ బాండ్ తెలిపారు. అందుకే పర్యావరణంలో పెద్దఎత్తున చెత్త పోగుపడేందుకు దారితీసే ఈ సమస్యను హైలైట్ చేయాలనుకుంటున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. వెదురు టూత్ బ్రష్ లేదా కాన్వాస్ షాపింగ్ బ్యాగ్‌కు మారడం వల్ల ప్రపంచానికి మేలు జరగదని.. ప్లాస్టిక్ ఉత్పత్తి వాణిజ్య, పారిశ్రామికపరంగా పెద్ద ఎత్తున చెలామణిలో ఉందన్నారు. కాబట్టి టాప్-డౌన్ పాలసీల అమలు, క్షేత్రస్థాయి ఒత్తిడి కలయికతో 'enough is enough' అని చెప్పాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.