'గిరిజనులకు సేవ చేయడం అదృష్టం.. మళ్లీ మీ గ్రామానికి వస్తా..'

దిశ, అశ్వారావుపేట/దమ్మపేట: గిరిజనులకు సేవ - Bhadradri Kottagudem District Dammapeta Mandal Telangana Governor visits Pusukunta in remote forest area

Update: 2022-04-12 11:27 GMT

దిశ, అశ్వారావుపేట/దమ్మపేట: గిరిజనులకు సేవ చేయడం నా అదృష్టమని, మళ్లీ మీ గ్రామానికి వస్తానని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మారుమూల అటవీ ప్రాంతంలోని పూసుకుంటను మంగళవారం ఆమె సందర్శించారు. సుమారు ఎనిమిది కిలోమీటర్ల అటవీ ప్రాంతం గుండా ప్రయాణించి పూసుకుంటకు చేరుకున్న గవర్నర్‌కు గిరిజన సాంప్రదాయ వస్త్రధారణ డప్పు వాయిద్యాలతో గ్రామస్థులు ఆహ్వానం పలికారు. ముందుగా అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ గిరి పోషణ పౌష్టికాహార స్టాల్స్‌ను పరిశీలించారు.


గవర్నర్ గ్రాంట్‌తో గోగులపూడి, పూసుకుంటలలో వేర్వేరుగా రూ.16 లక్షల వ్యయంతో నిర్మించనున్న రెండు కమ్యూనిటీ హాళ్లు, రూ.8 లక్షలతో పూసుకుంట ప్రాథమిక పాఠశాల భవనం విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత గ్రామంలోని కొందరి ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా ఏర్పాటుచేసిన ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆదివాసిలు పాల్గొన్న సభకు హాజరైన గవర్నర్ తెలుగులో ప్రసంగించారు.


నా జీవితంలో ఈ రోజు ఎప్పటికీ గుర్తు ఉంటుంది. కొండరెడ్ల ప్రజలను వారి గ్రామంలోనే కలుసుకోవడం గొప్ప ఆనందంగా ఉందన్నారు. చాలా కాలం నుండి ఈ రోజు కోసం వేచి చూస్తున్నాను. ఇంత దట్టమైన అడవిలో ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందన్నారు. గవర్నర్ గానే కాకుండా వైద్యురాలిగా మారుమూల గిరిజన పల్లెల్లో పిల్లల పౌష్టికాహార లేమి కలచివేస్తుందని.. మీరు మంచి ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నదే నా సంకల్పం అన్నారు. తెలంగాణ గవర్నర్‌‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పలు గిరిజన గ్రామాల్లో అందించిన సేవలను వివరించారు.


అనంతరం సభకు వచ్చిన వారి కోసం సిద్ధం చేసిన వంటకాలను వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. పర్యటనకు స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ పీవో హాజరు కాలేదు. ప్రోటోకాల్ వివాదం పై స్పందించేందుకు గవర్నర్ విముఖత చూపారు. అనంతరం కొత్తగూడెం పయనమై వెళ్లారు.



Tags:    

Similar News