వార్తలు రాయడం మంచిదే.. కానీ ఫేక్ కాదు!.. హీరో శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు

Update: 2024-05-24 12:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తనపై తప్పుడు వార్తలు రాయోద్దని, అలా చేస్తే కోర్టు ద్వారా లీగల్ నోటీసులు పంపిస్తానని సినీ నటుడు, హీరో శ్రీకాంత్ అన్నారు. రేవ్ పార్టీలకు వెళ్లి డ్రగ్స్ తీసుకున్నానని వస్తున్న వార్తలపై శ్రీకాంత్ స్పందించారు. ఇవ్వాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవ్ పార్టీ గురించి వచ్చిన వార్తల్లో నేను కూడా ఉన్నానని, నాలాగే ఉన్న వారు ఉన్నారని కొన్ని పేపర్లలో రాయడం జరిగిందని అన్నారు. సమాజ హితం కోసం మీడియా మిత్రులు కొన్ని వార్తలు రాయడం మంచిదేనని, వాటి వల్ల ఇప్పుడు ఉన్న యూత్ ఇలాంటి వాటి గురించి తెలుసుకొని అవగాహాన తెచ్చుకుంటారని తెలిపారు.

అంతేకానీ ఒక వ్యక్తి మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఫేక్ న్యూస్ రాయొద్దని మీడియాను అభ్యర్ధించారు. నిజనిజాలు తెలుసుకొని నిజంగా ఉందంటే ఉందని, లేదంటే లేదు అని రాయాలని సూచించారు. అన్ని తెలిసి కూడా అలాగే రాస్తే కేసులు ఫైల్ చేయడం కానీ, కోర్టుకు వెళ్లి లీగల్ నోటీసులు పంపించడం కానీ జరుగుతుందని హెచ్చరించారు. నేను అక్కడ లేను అని తెలిసి ఎందుకు నన్ను చూపిస్తున్నారో అర్ధం కావడం లేదని, ఒక వేళ నాపై ఫేక్ క్రియేట్ చేసినట్లు తెలిస్తే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడానికి రెఢీగా ఉన్నానని శ్రీకాంత్ తేల్చి చెప్పారు.

Similar News