రాష్ట్రంలో ఒక్క సీటైనా గెలుస్తామా.. BRSలో టెన్షన్..టెన్షన్!

లోక్ సభ ఎన్నికలపై గులాబీ లీడర్లకు టెన్షన్ పట్టుకున్నది.

Update: 2024-05-04 02:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్ సభ ఎన్నికలపై గులాబీ లీడర్లకు టెన్షన్ పట్టుకున్నది. ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాలే పార్టీ భవిష్యత్‌ను నిర్ణయించే పరిస్థితి ఉండటంతో గెలుపోటములపై ఆరా తీస్తున్నారు. ‘అన్నా.. లోకసభ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఎట్లుందే?.. పార్టీ మీద జనాలకు కోపం పోయిందా?.. సార్ మీటింగ్‌‌లకు జనాలు బాగానే వస్తున్నారు. కానీ, ఒక్క ఎంపీ సీటైనా గెలుస్తామా? ఒకవేళ ఒక్క సీటు కూడా గెలువకపోతే గ్రామాల్లో మన పార్టీ జెండాలు పట్టుకునేటోళ్లు ఉంటరానే..’ అని లీడర్లు చర్చించుకుంటున్నారు. గౌరవప్రదమైన రిజల్ట్ రావాలని ఆశిస్తున్నారు.

కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ

రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటీ ఉండగా, కేవలం రెండు మూడు స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ ముఖాముఖీ పోటీలో నిలుస్తున్నట్టు పలు సర్వేల్లో వెల్లడైందనే టాక్ ఉంది. క్షేత్ర స్థాయిలో ఎన్నికల ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ లీడర్లు సైతం ఇదే అభిప్రాయంలో ఉన్నారు. లోకసభ ఎన్నికల్లో పార్టీకి సానుకూల పరిస్థితులు లేవని ఇంటర్నల్ మీటింగ్‌లో మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తున్నది. ‘ఎక్కడ చూసినా కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంది. మేం రెండు స్థానాల్లో సెకండ్ ప్లేస్‌లో ఉంటాం. ఈ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిస్తే చాలు. ఒకవేళ ఆ ఒక్క సీటు కూడా గెలవకపోతే మా పార్టీ పరిస్థితి గోవిందా.. గోవిందా..’ అని ఓ మాజీ మంత్రి వివరించారు. పార్టీకి ఫీల్డ్‌లో ఉన్న పరిస్థితులు గ్రహించిన కేసీఆర్ ఆ ఎఫెక్ట్ కేడర్‌పై పడకుండా ఉండేందుకు 8 నుంచి 12 స్థానాల్లో గెలిచి కేంద్రంలో కీలకంగా మారుతామంటూ బూస్టింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ ఉంది.

ఆశలన్ని మెదక్ సీటుపైనే

17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోన్న బీఆర్ఎస్ కేవలం ఒక్క మెదక్ స్థానంలో గెలుస్తామని ఆశలు పెట్టుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ పరిధిలోని 6 స్థానాల్లో బీఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్ విజయం సాధించాయి. అలాగే అక్కడ కేసీఆర్ పట్ల ప్రజల్లో సానుభూతి ఉంది. మరోవైపు ఆ స్థానంలో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్‌గా పనిచేస్తున్నారు. అభ్యర్థిగా ఉన్న ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి స్థానిక ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. దీంతో మెదక్ సీటును సొంతం చేసుకుంటామని ధీమాలో గులాబీ లీడర్లు ఉన్నారు.

కేసీఆర్ సభల పట్ల జనాల్లో ఆసక్తి

మాజీ సీఎం కేసీఆర్ చేపడుతోన్న రోడ్డు షోలకు జనాలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. పదేళ్ల పాటు సీఎంగా పనిచేసిన కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఏం చెపుతారోనని వినేందుకు ఆసక్తి చూపుతున్నారు. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ కేవలం పబ్లిక్ మీటింగ్స్‌కు మాత్రమే వచ్చేవారు. ఆ సభలకు వెళ్లిన వారు ఆయన్ను దూరంగానే చూసేవారు. కానీ, ప్రస్తుతం రోడ్డు షోలు నిర్వహించడం వల్ల ఆయనను దగ్గరగా చూడొచ్చనే కారణంతోనూ జనాలు వస్తున్నట్టు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, కేసీఆర్ రోడ్డు షోలకు వస్తోన్న ప్రజలను చూసి, కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత మొదలైందని, రానున్న రోజుల్లో మరింత పెరిగి, తమకు అనుకూలంగా మారుతుందని గులాబీ లీడర్లు లెక్కలు వేస్తున్నారు.

ప్రతికూల పరిస్థితుల్లో బీఆర్ఎస్

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత బీఆర్ఎస్‌కు క్షేత్ర స్థాయిలో రోజురోజుకూ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. మెజార్టీ మంది లీడర్లు, కేడర్ పార్టీలో ఉండేందుకు ఇంట్రస్ట్ చూపడం లేదు. రాజకీయ భవిష్యత్ ఉన్న పార్టీలో చేరుతున్నారు. లోకసభ ఎన్నికల షెడ్యూలు వచ్చిన తరువాత ఐదుగురు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు పార్టీ వీడారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పేరు ప్రకటించిన తరువాత కడియం కావ్య కాంగ్రెస్ గూటికి వెళ్లి, ఆ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగారు. ముగ్గురు ఎమ్మెల్యేలు(దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు) కాంగ్రెస్‌లో చేరారు. క్షేత్ర స్థాయిలో ఉండే లీడర్లు ఎన్నికల్లో పనిచేసేందుకు ముందుకు రావడం లేదనే టాక్ వినపడుతోంది.

రోడ్ షోలపై కేసీఆర్ ఆరా

బీఆర్ఎస్ నిర్వహిస్తున్న రోడ్డుషోలకు ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుందనే అంశంపై పార్టీ అధినేత కేసీఆర్ ఆరా తీశారు. ఎలా ముందుకు సాగాలి... ఇంకా ఏయే అంశాలను ప్రస్తావించాలి... జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీపై ఎలా అస్త్రాలను సంధించాలనే దానిపైనా ఫాం హౌజ్ నుంచి నేతలకు ఫోన్ చేసి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. పోలింగ్ ముగిసేవరకు అప్రమత్తంగా ఉండాలని, సర్వేలు అనుకూలంగా వస్తున్నాయని, సమయం వృథా చేయోద్దని నేతలకు సూచించారు.

48గంటల పాటు తను ప్రచారం చేయకుండా ఈసీ నిషేధం విధించడంతో ఫాం హౌజ్ లో ఉన్న కేసీఆర్ గురు, శుక్రవారం మధ్యాహ్నం వరకు ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు, నేతలకు ఫోన్ చేశారు. రోడ్డుషోలు ఎలా జరుగుతున్నాయనే వివరాలను సేకరించారు. జనసమీకరణపై నేతలను అభినందించినట్లు సమాచారం. అయితే ఇంకా ప్రజల్లోనూ అటూ కేడర్ లోనూ జోష్ నింపాలంటే ఏయే అంశాలు ప్రస్తావించాలనే అంశాలను సైతం సేకరించినట్లు సమాచారం. సమయాన్ని వృథా చేస్తే నష్టపోతామని, అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పిదాలు రిపీట్ కాకుండా చూసుకోవాలని, కేడర్ ను కలుపుకొని పోవాలని సూచించారు. 12 సీట్లు గెలుస్తామని తాజా సర్వేల్లోనూ వెల్లడైందని, రాబోయే భవిష్యత్ బీఆర్ఎస్ దేనని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నేతలంతా కేడర్ ను సమన్వయం చేసుకుంటూ ముందు సాగాలని, యూత్, మహిళా, అన్ని కమ్యూనిటీలతో సమ్మేళనాలు నిర్వహించాలని నేతలకు కేసీఆర్ సూచించారు.

Similar News