మొన్నటి వరకు CM, ఇప్పుడు ఉత్తమ్.. ఏలేటి వెనక ఉన్నదెవరు?

బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వరసగా కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.

Update: 2024-05-23 02:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వరసగా కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. మంత్రులు ట్యాక్స్‌ల పేరుతో పైసలు వసూలు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఏలేటి వెనుక తమ లీడర్ల హస్తం ఉందా? అనే అనుమానాలు కాంగ్రెస్ నాయకులకు మొదలైంది. ఎందుకంటే ఆయన చేస్తోన్న విమర్శలు కాంగ్రెస్‌లోనే కాక పుట్టిస్తున్నాయి. ఆయన ఎప్పుడు ఏ నాయకుడిని టార్గెట్ చేస్తారోననే టెన్షన్ హస్తం పార్టీలో నెలకొన్నది.

హాట్ టాపిక్‌గా ఉత్తమ్‌పై విమర్శలు..

ఇరిగేషన్ బిల్లుల కోసం బీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఏలేటి పరోక్షంగా ఆర్థిక మంత్రి భట్టిని టార్గెట్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిని ఇన్ డైరెక్ట్‌గా ఎటాక్ చేశారు. దీంతో కాంగ్రెస్ లీడర్ల ప్రొత్సాహంతోనే ఏలేటి ఆరోపణలు చేస్తున్నారనే చర్చ కాంగ్రెస్‌లో జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్‌లోని కొందరు కీలక నేతలతో మహేశ్వర్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పార్టీ అంతర్గత అంశాలను సదరు లీడర్లే ఏలేటికి చేరవేస్తున్నారేమోనని అనుమానాలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి సైతం తీసుకెళ్లారు. అయితే ఏలేటి తాజాగా రైస్ మిల్లర్లతో సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమ్మక్కై ‘యూ’ ట్యాక్స్ పేరుతో వందల కోట్లను వసూలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఉత్తమ్ సీరియస్‌గా రెస్పాండ్ అయ్యారు. తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తే సహించనని ఘాటుగా సమాధానం చెప్పారు.

ఏలేటికి షాకిచ్చిన రేవంత్

ఈ నెల 18న సీఎం రేవంత్‌రెడ్డి బిజీ షెడ్యూలులో ఉన్నారు. ఉదయం ఇరిగేషన్ రివ్యూ, సాయంత్రం కేబినెట్ సమావేశం పెట్టుకున్నారు. సరిగ్గా అదే రోజు ఉదయం రైతాంగ సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు తమకు సీఎం అపాయింట్‌మెంట్ కావాలని ఏలేటి సీఎంఓ అధికారులను సంప్రదించారు. సీఎం బీజీ షెడ్యూలు నేపథ్యంలో తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే సెక్రటేరియట్ ఎదుట ఆందోళనకు దిగాలని బీజేపీ లీడర్లు ప్లాన్ చేసుకున్న విషయం రేవంత్ గ్రహించారు. వెంటనే బీజేపీ నాయకులను పిలిచి వినతి పత్రం తీసుకుని, ఫొటోలను అధికారికంగా విడుదల చేయించారు. దీంతో ఏలేటి వ్యూహం బెడిసి కొట్టిందనే చర్చ బీజేపీ వర్గాల్లో ఉంది. అయితే సెక్రటేరియట్‌కు వెళ్లి సీఎం‌ను కలిసి వచ్చిన తర్వాత మహేశ్వర్‌రెడ్డి టార్గెట్ రేవంత్ నుంచి ఉత్తమ్‌పై ఎందుకు మళ్లింది? మొహమాటం కారణంగా రేవంత్‌పై విమర్శలు చేయడం లేదా? ఇంకా ఏమైనా ఇతర రాజకీయ కారణాలు ఉన్నయా? అని కాంగ్రెస్ లీడర్లు ఆరా తీస్తున్నారు.

Similar News