కలలోనూ ఊహించని స్కీం తెస్తాం.. నర్సాపూర్ సభలో రాహుల్ గాంధీ సంచలన ప్రకటన

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎవరూ కలలో కూడా ఊహించనటువంటి విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు.

Update: 2024-05-09 13:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎవరూ కలలో కూడా ఊహించనటువంటి విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. ఇటువంటి పని ఇప్పటివరకు ఎక్కడా ఏ ప్రభుత్వం చేయలేదని తాము ప్రారంభించాక ప్రపంచంలోని మిగతా దేశాలు ఇదే కార్యక్రమాన్ని అనుసరిస్తాయని తెలిపారు. ఇవాళ మెదక్ జిల్లా నర్సాపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ దేశంలోని నిరుపేదలందరి జాబితాను రూపొందించి వారి కుటుంబంలోని మహిళల బ్యాంకు ఖాతాలో ఏడాదికి రూ. లక్ష చొప్పున ఈ నగదును విడతల వారీగా ప్రతి నెల రూ.8,500 వారి ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. మొట్టమొదట రైతు రుణమాఫీ చేయడంతో పాటు.. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.

కులగణనతో రిజర్వేషన్లు పెంచుతాం..

రాజ్యాంగంతోపాటు రిజర్వేషన్లను కూడా రద్దు చేయాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నాయని, ఇందులో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించి అన్నీ ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. కానీ తాము కులగణన చేపట్టి రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్ పేర్కొన్నారు. తెలంగాణలో ఆగస్టు 15 వరకు రైతుల రుణమాఫీ చేయబోతున్నామని, ఇక్కడ రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ టీమ్ పని చేస్తున్నదని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చాలనే బీజేపీ కుట్రను తాము అడ్డుకుంటామన్నారు. జూన్ 4 ఇండియా కూటమి అధికారంలోకి రాబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్.. బుద్ధి తెచ్చుకో : సీఎం రేవంత్ రెడ్డి

ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీజేపీ వాళ్లకు రాముడు, హనుమాన్ జయంతి గుర్తుకు వస్తాయని, మరొకరికి బతుకమ్మ గుర్తుకు వస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి మండిప్డడారు. పోలింగ్ బూత్‌లో ఓట్ల కోసం బిచ్చగాళ్ల మాదిరిగా శ్రీరాముడిని, హనుమంతుడిని వాటుకుంటున్న బీజేపీ వాళ్లను ఆ దేవుడు కూడా క్షమించడని ఫైర్ అయ్యారు. కేసీఆర్ బస్సు యాత్ర చూస్తుంటే ‘తిక్కలోడు తిరునాళ్లకు వెళ్తే ఎక్కడానికి దిగడానికే సరిపోయింది’ అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిపై కేసీఆర్ ఏదేదో మాట్లాడారట.. కేసీఆర్ వయసు మీద పడింది.. ఇకనైనా బుద్ధి తెచ్చుకో అని సూచించారు. బలహీన వర్గాల నుంచి వచ్చిన నీలం మధును గెలిపించాలని సీఎం పిలుపునిచ్చారు.

మీ ఇంటి బిడ్డలా అందుబాటులో ఉంటా : నీలం మధు

పేదింటి బిడ్డనైన తనను ఎంపీగా గెలిపిస్తే మీ ఇంటి బిడ్డలా అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తానని మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ప్రజలకు హామీ ఇచ్చారు. అందరినీ కలుపుకుకొని పని చేసే తనను గెలిపించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ అంటే సమానత్వం కలిగిన పార్టీ అని, ఇందిరా గాంధీ ఎంపీగా ఉండి ప్రధాన మంత్రిగా పని చేసిన గడ్డ నుంచి తనకు అవకాశం ఇవ్వడంపై జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి మధు కృతజ్ఞతలు తెలిపారు.

Read More...

‘400 సీట్లా.. బీజేపీకి అంత సీన్ లేదు’ 



Tags:    

Similar News