బ్లాక్ మెయిలర్ కావాలా...గోల్డ్ మెడలిస్ట్ కావాలా : హరీష్ రావు

కాంగ్రెస్‌కు ఓటు వేయడమంటే వారి మోసాలను బలపర్చడమే అవుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు.

Update: 2024-05-23 13:51 GMT

దిశ, తొర్రూరు:- కాంగ్రెస్‌కు ఓటు వేయడమంటే వారి మోసాలను బలపర్చడమే అవుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని పిఎస్ఆర్ స్కూల్ ఆవరణంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎన్నికల సన్నాహ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిద్ధిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, తొలి స్పీకర్ మధుసూదనాచారి,మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.

హరీశ్‌రావు మాట్లాడుతూ....

కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మోసపూరితమైన ప్రభుత్వం.. రేవంత్ రెడ్డి ఉద్యోగ కల్పన విషయంలో వంట అంతా వండి పెట్టాక.. వడ్డించినట్టు కాంగ్రెస్‌ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. అదేవిధంగా..సన్నవడ్లకే రూ.500 బోనస్ అని కాంగ్రెస్ ప్రకటించడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సన్నవడ్లకే బోనస్ ఇస్తామనడం దారుణం అన్నారు. కాంగ్రెస్ గ్యారంటీల పేరుతో ప్రజలను ముంచిందన్నారు. ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు నిర్ణయంతో దొడ్డు బియ్యం పండించే రైతులు నట్టేట మునుగుతున్నారని తెలిపారు. తెలంగాణలో 10 శాతం మాత్రమే సన్న వడ్లను పండిస్తారని.. 90 శాతం మంది రైతులకు ఈ బోనస్ అందే చాన్స్ లేదన్నారు.

అదేవిధంగా రైతుబంధు విషయంలో, బోనస్ విషయంలో కాంగ్రెస్ సర్కారు చేతులెత్తేసిందన్నారు. విత్తనాలు నాటక ముందే పంటకు పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని అయితే వర్షాలు ప్రారంభం అవుతున్నందున జూన్ నెల ప్రారంభంలోనే రైతు బంధు ఇవ్వాలని హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అదేవిధంగా మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని లేపాలంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.

రాకేష్ రెడ్డి మాట్లాడుతూ...

పట్టభద్రుల ఎన్నిక అనేది చాలా ముఖ్యమని వరంగల్ - ఖమ్మం - నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనుముల రాకేష్ రెడ్డి అన్నారు. చదువుకున్న వాళ్ళు, మేధావులు, విద్యావంతులు సమాజానికి ఉపయోగపడే వారిని ఎన్నుకుంటారన్నారు. రెండు సార్లు కేసీఆర్‌కు అవకాశం ఇచ్చిన ప్రజలు... మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ప్రశ్నించే వ్యక్తిని చట్ట సభల్లో ఉండాలన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తి కావాలా?.... ప్రశ్నించలేని వ్యక్తి కావాలా? అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రశ్నించే గొంతు అంటున్నారని.. మల్లన్న ఏ విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని అడిగారు.

ఇప్పటిదాక నిరుద్యోగ భృతి విషయంలో, నిరుద్యోగులకు ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్‌పై ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్ అమలు కావాలంటే తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. కేసీఆర్ ఆశీర్వాదం, ప్రజల ఆశీస్సులతో గెలుస్తానన్నారు.బీఆర్ఎస్ అభ్యర్ధిగా నేను ప్రశ్నించే గొంతును... మా ప్రశ్న ప్రజల కోసం... ప్రజా సమస్యల కోసం మాత్రమే..దందా కోసం,డబ్బు కోసం,వ్యూస్ కోసం కాదు అని స్పష్టం చేశారు. ఐదవ సారి గులాబీ జెండాను ఈ గడ్డ మీద ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పెద్దలు పట్టభద్రులు ఈనెల 27 న జరిగే ఎన్నికలో 3 నెంబర్‌పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని రాకేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పార్టీ శ్రేణులు పట్టబద్రులు తదితరులు పాల్గొన్నారు.

Similar News