కాంగ్రెస్ పార్టీలో ప్రశ్నించే గొంతుక మల్లన్న : మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేయడం చూసి బీజేపీ,బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ఏడుపుగొట్టు రాజకీయాలు చేస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Update: 2024-05-23 15:40 GMT

దిశ, మరిపెడ: కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేయడం చూసి బీజేపీ,బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ఏడుపుగొట్టు రాజకీయాలు చేస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ గురువారం మరిపెడ పట్టణ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వరంగల్ -ఖమ్మం- నల్గొండ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్, డోర్నకల్ శాసనసభ్యుడు రామచంద్రు నాయక్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ… మూడేళ్ల నుంచి పచ్చి రొట్టె విత్తనాలకు బాకీ చెల్లించకుండా రైతులపై ప్రతిపక్ష పార్టీ నేతలు ముసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవ చేశారు. వర్షాలు పడుతుండడంతో ప్రస్తుతం ఆ విత్తనాలు అత్యంత అవసరం కాబట్టి బాకీ త్వరలోనే చెల్లిస్తామన్ని వారికి చెప్పి ఆ విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాము అన్నారు. వ్యవసాయనికి పంట బీమా ఇన్సూరెన్స్ చెల్లించకుండా గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ప్రతి రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా బీమా ప్రీమియం త్వరలోనే మేమే చెల్లిస్తామని చెప్పుకొచ్చారు.

వరి వేస్తే ఊరి అని ఆనాడు బి ఆర్ ఎస్ ప్రభుత్వం రైతుల గోస పంచుకోలేదా బోనస్ అంటూ బోగస్ మాటలు చెప్పి ఐదు సంవత్సరాలు కాలం వెళ్లబుచ్చింది మీరు కారా అంటూ ప్రశ్నించారు. సన్న వడ్లతోపాటు దొడ్డు వడ్లకు కూడా 500 రూపాయలు బోనస్ చెల్లిస్తామని ఉపోద్ఘాటించారు. చివరగా మల్లన్న ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఉన్న ప్రజా సమస్యలను వెలుగెత్తి చూపిస్తూ ఎవరి అండదండలు లేకున్నా ఒంటరిగా ప్రభుత్వం పైన కొట్లాడావని, గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 39 నెంబర్ లో ఉన్నా కూడా కసితో పట్టభద్రులందరూ ఓట్లు వేశారని ఇప్పుడు ఎమ్మెల్సీగా గెలిచాక ప్రజా సమస్యలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పై గొంతు ఎత్తాలి ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.

నేను ప్రజా గొంతుక తప్పులు చేస్తే కాంగ్రెస్ పార్టీని సైతం ప్రశ్నిస్తా- ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న

నేను ప్రజా గొంతుకనని తప్పులు చేస్తే కాంగ్రెస్ పార్టీని సైతం ప్రశ్నిస్తానని తప్పులు చేస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్వేచ్ఛ కేవలం కాంగ్రెస్ పార్టీలోనే ఉందని మల్లన్న చెప్పుకొచ్చాడు. తప్పులు చేసిన నిన్ను నువ్వు ప్రశ్నించుకో కేసీఆర్, కేటీఆర్, హరీష్ అంటూ విమర్శించాడు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తానని ఈ ఒక్కసారి తనకు అవకాశం కల్పించి గెలిపించాలని గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో డోర్నకల్ నియోజకవర్గం అత్యధిక మెజార్టీనిచ్చిందని ఇప్పుడున్న 34 నియోజకవర్గాలలో మళ్లీ ఈ నియోజకవర్గమే మెజార్టీని ఇవ్వాలని పట్టబద్రులను మల్లన్న కోరాడు.

గతంలో లాగా ప్రాధాన్యత ఓటుని వృథా చేయవద్దని సీరియల్ నెంబర్ 2లో మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి కానీ గతంలో లాగా "జై మల్లన్న" అంటూ దయచేసి బ్యాలెట్ పేపర్ పై రాయవద్దని ఓటు ను వృధా చేయవద్దని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఓటు హక్కును ఎలా వినియోగించలో సూచనలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పట్టభద్రులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Similar News