ఆయిల్ పాల్ నర్సరీని పరిశీలించిన శాస్త్రవేత్తలు.. ఆ మొక్కలనే సరఫరా చేయాలని ఆదేశాలు
దిశ, రేగొండ : మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆయిల్ పామ్ నర్సరీని శనివారం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ఫామ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఇందులో జాతీయ పామాయిల్ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు డాక్టర్ రామచంద్రుడు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ శాస్త్రవేత్త పోరిక హరికాంత్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎంఏ అక్బర్‌లు ఉన్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త డాక్టర్ రామచంద్రుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం భూపాలపల్లి జిల్లాకి ఈ ఆయిల్ పామ్ నూతన పంట కాబట్టి దీన్ని నర్సరీలో చేపట్టే యాజమాన్య పద్ధతులు, అలాగే వివిధ దశల్లో అమలు చేస్తున్న పనులను పరిశీలించామన్నారు. నర్సరీ సిబ్బందికి నర్సరీలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల మీద అవగాహన కల్పించి, రైతులకు మంచి నాణ్యమైన ఆరోగ్యకరమైన మొక్కలను సరఫరా చేయలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం భూపాలపల్లి జిల్లాకు 1125 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు భౌతిక లక్ష్యంగా నిర్ణయించామని అన్నారు. దాదాపుగా ఇప్పటి వరకు జిల్లాలో 400 ఎకరాలు ఆయిల్ పామ్ మొక్కలు నాటామన్నారు. ప్రస్తుతం నర్సరీలో దాదాపుగా మూడు లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సందర్శనలో ఉద్యాన శాఖ అధికారులు ఏ.సునీల్ కుమార్, ఎస్.శంకర్, సుమన్, ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన నర్సరీ ఇంచార్జ్ రవి, అరవింద్, రాందాస్ పాల్గొన్నారు.