కేయూ హాస్టల్ మెస్ చట్నీలో బల్లి

కాకతీయ యూనివర్సిటీ కామన్ మెస్ లో ఉదయం అల్పాహారం లో వాడే

Update: 2024-05-07 14:23 GMT

దిశ, కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ కామన్ మెస్ లో ఉదయం అల్పాహారం లో వాడే చట్నీలో బల్లి కనబడడంతో విద్యార్థులు హాస్టల్ డైరెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే టిఫిన్ చేసిన పలువురు విద్యార్థులు వికారానికి లోనయ్యారు. దీంతో ఉదయం నుండి మధ్యాహ్న భోజన సమయం వరకు కామన్ మెస్ కి తాళం వేసి అక్కడే ధర్నాకు ఉపక్రమించారు. కేయూ హాస్టల్ డైరెక్టర్ పర్యవేక్షణ లేని కారణంగా హాస్టల్ వర్కర్స్ పరిశుభ్రత పాటించడం లేదని, నాసిరకం కిరాణా సామాగ్రి తో భోజనం చేయాల్సి వస్తుందని అయినా కూడా గత మూడు నెలల నుంచి మెస్ బిల్లులు రెండు వేల రూపాయలు దాటుతుందని విద్యార్థులు డైరెక్టర్ పి శ్రీనివాస్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మెస్ లో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరపాలని డైరెక్టర్ తో వాగ్వాదానికి దిగారు. వాతావరణం ఉద్రిక్తం కావడంతో హాస్టల్ అధికారులు మాట్లాడుతూ చట్నీలో బల్లి రావడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలుపడంతో విద్యార్థులు ధర్నాను నిలిపివేశారు. కేయూ హాస్టల్ డైరెక్టర్ పి శ్రీనివాసరావును ‘దిశ’ న్యూస్ వివరణ కోరగా విద్యార్థుల ఫిర్యాదు మేరకు తాను మెస్ కి వెళ్లి ఘటన చూశానని బల్లి చట్నీ ప్రిపేర్ చేశాక పడి ఉండవచ్చు అని సందేహం వ్యక్తం చేశానని వంట సెక్షన్ లో పని చేసే వర్కర్ లను అడిగి విషయాలు తెలుసుకొని విచారణ చేయిస్తానని హామీ ఇచ్చాను అని తెలిపారు.

Similar News