ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ఆందోళన

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బైఠాయించి ఆందోళన

Update: 2024-05-26 15:31 GMT

దిశ,చెన్నారావుపేట : ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బైఠాయించి ఆందోళన చేపట్టిన సంఘటన చెన్నారావుపేట మండల కేంద్రంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... చెన్నారావుపేట మండల కేంద్రానికి చెందిన యువతి ఇదే గ్రామానికి చెందిన మజ్జిగ అన్వేష్ అనే యువకుడిని ప్రేమించింది. సుమారు 8 సంవత్సరాల నుండి వీరి మధ్య ప్రేమాయణం కొనసాగుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి యువకుడు కొద్ది నెలల నుండి మరో యువతి మోజులో పడి నిర్లక్ష్యం చేస్తూ పెళ్లి చేసుకోమంటే రేపు మాపు అంటూ దాటవేస్తూ తప్పించుకుంటున్నాడని బాధిత యువతి వాపోయింది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయానని తల్లి, సోదరి తో కలిసి ఉంటున్నానని ప్రేమ పేరుతో 8 సంవత్సరాలు తిప్పుకున్నాడని, కలిసి అనేక చోట్లకు తిరిగామని, తీరా వివాహాం చేసుకోమంటే మాట మారుస్తూ మొహం చాటేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.

పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడతానని యువకుడు అన్వేష్ ఆదివారం వచ్చి తిరిగి మూడు నెలల సమయం కావాలంటూ దాట వేస్తున్నాడని మరో యువతి మోజులో పడడంతో నా బతుకు ఆగమైందని, ప్రియుడు అన్వేష్ తోనే పెళ్లి చేయాలని కోరుతూ ఆదివారం ప్రియుడి ఇంటి ముందు యువతి బైఠాయించి ఆందోళనకు దిగింది.తండ్రి లేని నాకు న్యాయం చేయాలని అతనితోనే పెళ్లి జరిపించాలని వివాహం చేసే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని యువతి రోదిస్తూ కూర్చుంది. విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు ఆందోళన చేస్తున్న యువతికి మద్దతు తెలిపారు. ప్రేమ పేరుతో యువతిని మోసం చేయడం సరైన పద్ధతి కాదని పెళ్లి చేసుకునే వరకు యువతి బాధ్యత మీదేనని యువకుడి తల్లిదండ్రులతో మహిళలు ఆందోళనకు దిగారు. యువతికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని వారు మద్దతు పలికారు.

Similar News