రైతులు ఆందోళన చెంది ధాన్యం అమ్మకం చేయవద్దు : కలెక్టర్

జిల్లాలో వరి ధాన్యం పండించిన రైతులు ఆందోళన చెంది తక్కువ

Update: 2024-05-22 14:39 GMT

దిశ, ములుగు ప్రతినిధి: జిల్లాలో వరి ధాన్యం పండించిన రైతులు ఆందోళన చెంది తక్కువ ధరకు ధాన్యం అమ్మకం చేసుకోవద్దని, చివరి గింజ వరకు ప్రభుత్వం గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం కలెక్టర్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ ) సి.హెచ్. మహేందర్ జి, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి లతో కలిసి కలెక్టరు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 50వేల 175 ఎకరాలలో ఒక లక్ష 4,775 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండిస్తున్నారని, రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు చేయడానికి ఇప్పటికే జిల్లాలో ఎఫ్ సి ఐ ద్వారా కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అకాల వర్షాల కారణంగా కొన్ని చోట్ల వరి ధాన్యం తడవగా ఆ ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకురావాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారని అన్నారు. కొందరు రైతులు కంగారుపడి రైస్ మిల్లర్లకు తక్కువ ధరకే అమ్మకం చేసుకుంటున్నారని విషయం గ్రహించామని, రైతులు ఎవరు వరి ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్మకం చేసుకోవద్దని సూచించారు.

ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోకి వరి ధాన్యం రాకుండా ఇప్పటికే వాజేడు మండలం వద్ద ప్రత్యేక చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని, రెండు ఫ్లయింగ్ స్కాడ్స్ నిత్యం పర్యటిస్తున్నారని మండల స్థాయిలో ఎమ్మార్వో ఆధ్వర్యంలో నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఈ నెల 19న కురిసిన అకాల వర్షం కారణంగా 7000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం తడిసిందని, తడిసిన 7 వేల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. కొందరు వ్యక్తులు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వాటిని నమ్మవద్దని రైతులను కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు గురైన 9347416178 అనే హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి వివరించవచ్చని, హెల్ప్ లైన్ వారం రోజులలో 24 గంటలపాటు పని చేస్తుందని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు చేయడానికి సంబంధిత అధికారులతో కృషి చేస్తున్నామని, మొలకెత్తిన వరి ధాన్యంపై ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. విలేకరుల సమావేశంలో జిల్లా సివిల్ సప్లై మేనేజర్ బి. రాంపతి, డీసీ ఓ సర్దార్ సింగ్, డీపీఆర్ ఓ ఎండీ రఫిక్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Similar News