డోర్నకల్ అభివృద్ధికి తూట్లు.. చివాట్లు పెడుతున్న కలెక్టర్..

మున్సిపాలిటీ నిబంధనలకు అనుగుణంగా నిర్మించాల్సిన రోడ్డు పాలకులకు అనుకూలంగా నిర్మాణం జరిగిందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ వివేచన కమిటీ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ కాపరబోయిన సత్యనారాయణ అన్నారు.

Update: 2023-04-14 13:20 GMT

దిశ, డోర్నకల్ : మున్సిపాలిటీ నిబంధనలకు అనుగుణంగా నిర్మించాల్సిన రోడ్డు పాలకులకు అనుకూలంగా నిర్మాణం జరిగిందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ వివేచన కమిటీ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ కాపరబోయిన సత్యనారాయణ అన్నారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మా సంబంధిత అధికారులు, మున్సిపల్ ప్రధాన పాలకులు కుమ్మక్కైఅభివృద్ధికి తూట్లు పొడుస్తున్నారని ఆయన ఆరోపించారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో అక్కడి ప్రజాప్రతినిధుల చొరవతో రోడ్ల వెడల్పు విస్తరణ పనులు శరవేగంగా జరిగాయన్నారు. ప్రధాన పాలకుడి ఉదాసీన వైఖరి పట్టణ ప్రజలకు శాపంగా మారిందన్నారు. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్నప్పుడే 46 అడుగుల వెడల్పు చేపట్టాలని గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది. మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిన తర్వాత ఎన్టీఆర్ సర్కిల్ నుంచి రైల్వే స్టేషన్ వరకు విస్తరించిన బీటీ రోడ్డు 33 ఫీట్ల రోడ్డు నిర్మిస్తున్నారు.

గుత్తేదారుకు, అధికారులుకు కొన్ని ప్రదేశాల్లో 27, 28, 29 అడుగుల రోడ్డు విస్తరణ చేపట్టారని తెలిపారు. సుశీల్ ఇంటి వద్ద 27 ఫీట్ల నిర్మాణం జరిపి మురికి కాలువకు రెండో వైపు గోడలకు ఇంటి పునాదిని కాయం చేశారని అన్నారు. ఓ బంగారు దుకాణం ముందు రోడ్డు ఇరువైపులా సమానంగా ఉండాల్సిన రోడ్డును అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మక్కై ఆర్థిక లావాదేవీల కోసం ఒకవైపు మాత్రమే ఎక్కువ మొత్తం తొలగించి నిర్మాణం జరిపారని ఆరోపించారు. ఆ బంగారం దుకాణం కాపాడడం కోసం మున్సిపల్ చైర్మన్, అధికారులు, కొందరు పాలక సభ్యులు పోటీపడ్డారు. పురుషోత్తం, కమలమ్మ, విజయ ఇండ్ల ముందు ఎక్కువ మొత్తం తీసినారు. సదర్ దుకాణం తీయకుండా మేనేజ్ చేసినారు. డబ్బులు ఇస్తే ఒక నీతి ? ఇవ్వకపోతే మరో నీతి అని ప్రశ్నించారు. ఓ మందుల దుకాణం నుంచి రైల్వే స్టేషన్ వరకు 29 అడుగులు మించి లేదని ఆయన అన్నారు.

ఓ సెల్ పాయింట్ బంగ్లా కింది నుంచి మురికి కాలువ నిర్మించారు. ఎవరికోసం ఈ విధంగా చేశారని ఆగ్రహించారు. ఆ వార్డు ప్రజాప్రతినిధి ఇంటి ముందు 25 ఫీట్ల రోడ్డు మాత్రమే వేశారన్నారు. ప్రజా ప్రతినిధి ఆస్తిని కాపాడడం కోసం మురికి కాలువ సైతం వంకర్లు తిరిగిందని అన్నారు. ప్రధాన రోడ్డు విస్తరణకు తొలగింపులు చేపట్టిన నాడు ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్, పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆ హోదాలో పాత డోర్నకల్ ప్రాంతంలో కూలినాలి చేసుకొని బ్రతికే కడు బీదల ఇండ్లపై ప్రతాపం చూపి 42 అడుగుల వెడల్పు తీసినారు. గూడు కోల్పోతున్నాం కనికరించండి అన్నా వినకుండా విస్తరణ పనులు జరిపారు. వ్యాపారుల ఇండ్ల వద్ద ఎందుకు తీయలేకపోయారని ప్రశ్నించారు. మున్సిపల్ చైర్మన్ గా ఉండి కూడా పేదవాడి పొట్ట కొట్టి బలిసినోనికి బాసటగా నిలుస్తున్నారని ఆరోపించారు. రోడ్డు అస్తవ్యస్త నిర్మాణం వలన ప్రమాదాలు జరిపి ప్రాణాలు కోల్పోతున్న పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై లోకాయుక్తకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

కేసు జూన్ లో ఫైనల్ కు వస్తుందని తెలిపారు. ఇది తెలిసి తనను మానసికంగా వేధిస్తున్నారని వాపోయారు. అలాగే చేపల మార్కెట్ నుంచి రైల్వే స్టేషన్ వరకు సమానంగా ఉన్న కాలువ ఎనిమిది అడుగుల విస్తీర్ణతో గత ఐదు దశాబ్దాల క్రితం నుంచి ఉంది. ఆ కాలువ క్రమేపి ఆక్రమణకు గురైంది. నేడు ఆ కాలువ కనుమరుగైపోయింది అన్నారు. ఆక్రమణదారులు తమది అంటూ కోర్టుకు వెళ్ళినారు. అప్పటి గ్రామ పంచాయతీ పాలకులు న్యాయపోరాటం జరిపినారు. 2015 సంవత్సరంలో జిల్లా కోర్టు తీర్పును వెలువరించింది. తీర్పుకు అనుగుణంగా స్వాధీనపర్చుకోవాల్సిన అధికారులు ప్రలోభాలకు లొంగిపోయారని ఆనాడు ప్రచారం జరిగింది.

మున్సిపాలిటీ అనంతరం కమిషనర్, పాలక వర్గ సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినారు. అయినప్పటికీ కాలువ ఆక్రమణలోనే ఉంది. అవినీతికి పాల్పడిన అధికారుల పై విజిలెన్స్ ఎంక్వయిరీ జరపాలన్నారు. కోర్టు స్టే ఉందని చెబుతూ రోడ్డు విస్తరణ పనులు జరగకుండా అడ్డుపడుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కట్టడాలను తొలగించి నిర్మాణం జరపాలన్నారు. పురపాలక చైర్మన్, వైస్ చైర్మన్ లను కలెక్టర్ ప్రతిసమావేశంలో చివాట్లు పెడుతూనే ఉన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి జరగటం లేదని తీవ్రస్థాయిలో ఆగ్రహించిన సందర్భాలున్నాయి. కలెక్టర్ మున్సిపాలిటీలో అడుగుపెట్టక ఏడాది అవుతుందని అన్నారు. అంతట సమాన్యాయం పాటించి 40 అడుగుల రోడ్డు ఉండే విధంగా చూడాలని ఉన్నతాధికారులను కోరారు.

Tags:    

Similar News