ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సామాగ్రి పంపిణీ పూర్తి : కలెక్టర్

వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఆదివారం

Update: 2024-05-26 12:21 GMT

దిశ, వరంగల్ కలెక్టరేట్ : వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఆదివారం రోజు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సామాగ్రి పంపిణీ కోసం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ (డి ఆర్ సి) సెంటర్ ను జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ పి. ప్రావీణ్య అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డి ఆర్ ఓ శ్రీనివాస్ లతో కలిసి పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏపీవో , పీఓ, ఓపీఓ, మైక్రో అబ్జర్వర్లు, సెక్టోరల్, జోనల్ అధికారులు పోలింగ్ లో ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త గా విధులు నిర్వర్తించాలని సూచించారు. జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ వద్ద 8 కౌంటర్లను ఏర్పాటు చేసి 59 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన పోలింగ్ సామాగ్రి 11 రూట్స్ ద్వారా 22 లొకేషన్ లలో పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రిని తరలించడం జరిగిందని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు ఉన్నారని, ఒకరికి ఇచ్చిన ప్రాధాన్యత ఓటు నెంబర్ తిరిగి అదే నంబర్ ఇతరులకు ఇవ్వకూడదని అలా ఇస్తే ఆ ఓటు చెల్లుబాటు కాదని తెలిపారు.

సోమవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించాలని, ఆదివారం రాత్రి పోలింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఉదయం 7 గంటలకు ఏజంట్లు సమక్షంలో బ్యాలెట్ బాక్స్ పరిశీలించాలని, తదుపరి సీల్ వేసి పోలింగ్ ప్రారంభించాలని ఆమె స్పష్టం చేశారు. ఓటు హక్కు వినియోగం రహస్య పద్ధతిలో జరుగుతుందని, బహిర్గతం చేయడం నిషేధమని తెలిపారు. ఓటర్లు పీఓ ఇచ్చిన వాయిలెట్ కలర్ పెన్ తో మాత్రమే నెంబర్లు వేయాలని ఆమె సూచించారు. 27 తేదీ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. జిల్లాలోని పట్టభద్రుల ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్చ గా వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి బాలకృష్ణ, జడ్పీసీఈఓ రామి రెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీకాంత్, కలెక్టరేట్ తాహసిల్దార్లు విశ్వ నారాయణ, రమేష్, మంజుల, తహసీల్దార్లు ఇక్బాల్, విజయ సాగర్, రియాజుద్దీన్, సెక్టోరల్ జోనల్ అధికారులు,ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Similar News