డోర్నకల్ లో చిగురించని కమలం.!

నాయకత్వలేమితో డోర్నకల్ లో బీజేపీ క్యాడర్ తీవ్ర నిరాశలో ఉంది

Update: 2022-12-06 14:21 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో/ మ‌రిపెడ: డోర్నక‌ల్ రాజ‌కీయాల్లో బీజేపీ ఊసులో కూడా లేకుండాపోతోంది. గ‌డిచిన కొంత‌కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో కొంత బీజేపీకి బ‌లం పెరిగింద‌న్న మాట కాద‌న‌లేని వాస్తవం. ఈ వేవ్ ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ కొన‌సాగుతోంది. అయితే డోర్నక‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో న‌డిపించే నాయ‌క‌త్వం లేక‌పోవ‌డంతో అక్కడక‌క్కడ ఉన్న శ్రేణులు గ‌ల్లంత‌వుతున్నారు. ఇంకా చెప్పాలంటే నిరాశ నిస్పృహాల‌కు లోన‌వుతున్నారు. నాయ‌క‌త్వం స‌మ‌స్య వెంటాడుతుండ‌టంతో దూకుడు రాజ‌కీయానికి దూరంగా ఉంటుండ‌టం గ‌మ‌నార్హం. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం.. ఆ తరువాత జరుగుతున్న పరిణామాలతో టీఆర్ఎస్‌ కోటగా మారింది. కాంగ్రెస్ క్యాడర్ గట్టిగా ఉండడంతో ఈసారి టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ ఈ రెండింటిలో గెలుపు ఎవరిని వరిస్తుందోన‌ని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ లెక్కలు వేస్తున్నారు. 2018 ఎన్నికలలో టీఆర్ఎస్‌కు 51 శాతం, కాంగ్రెస్ కు 41% ఓట్లు వచ్చాయి. కానీ బీజేపీ ఒక్క శాతం ఓటుతో చివరి స్థానంలో నిలిచింది. ఈ పరిస్థితుల్లో కేవలం 862 ఓట్లతో లక్ష్మణ్ నాయక్ పదవ స్థానంలో నిలవడం జరిగింది.

అధిష్టానం ప‌ట్టింపేది..?

ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లు బ‌లంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీల్లోనూ వ‌ర్గ, కుల రాజ‌కీయాలు ఫ‌రిడ‌విల్లుతుండ‌గా కొన్ని గ్రామాల‌కు చెందిన రెడ్డి, ఓసీ, బీసీ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన ఆయా పార్టీల్లోని నేత‌లు, యువ‌త బీజేపీ వైపు ఆస‌క్తిగా ఉన్నా నియోజ‌క‌వ‌ర్గంలో స‌రైన నాయ‌క‌త్వం లేద‌న్న విమ‌ర్శలు వినిపిస్తున్నాయి. అధిష్టానం కూడా ప‌ట్టింపులేనట్లుగా వ్యవ‌హ‌రిస్తోంద‌న్న విమ‌ర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి పుంజుకుంటుందన్న మాట వాస్తవమే కానీ మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.

క్యాడ‌ర్ గ‌ల్లంతు..

నాయకత్వ సమస్య చాలా ఏళ్లుగా బీజేపీని వేధిస్తూ వ‌స్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన‌ లక్ష్మణ్ నాయక్ స్థానికుడు కాక‌పోవ‌డం, పెద్దగా ఎవరికి అందుబాటులో లేకపోవడంతో పార్టీ బ‌లోపేతం కాక‌పోవ‌డానికి ప్రధాన కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. కార్యకర్తలకు అండ‌గా, నిత్యం అందుబాటులో ఉండే నేత‌లు లేక‌పోవ‌డంపై సొంత పార్టీ నేత‌లు మండిప‌డుతున్నారు. అధికార, ప్రతిప‌క్ష పార్టీ నాయ‌కులు పోటాపోటీ పడి ఏదో ఒక సందేశంతో ప్రజల్లో తిరుగుతూ ఉంటే మా నాయకులు ప‌త్తా లేకుండా ఉన్నార‌ని కార్యక‌ర్తలు ఎద్దేవా చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. మునుగోడు ఎన్నికలవేళ ప్రతి మండలం నుంచి నాయకుల్ని తీసుకెళ్లిన నేత‌లు పార్టీ ఫండ్ వచ్చినా క‌నీసం సరైన భోజనాలు, వసతి కల్పించలేదని వాపోతుండ‌టం గ‌మనార్హం. విషయాన్ని బహిరంగంగా చెప్తే ఉన్న కాస్త పార్టీ పరువు పోతుంది అని కార్యకర్తలు లో లోన మదనపడుతున్నారంట.

త్వరలో కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపే ఛాన్స్.!

విశ్వసనీయ సమాచారం మేరకు ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న ఓ కీలక నేత తన గ్రౌండ్ రిపోర్టును తయారుచేసినట్టు సమాచారం. ఇదే సమయంలో స్థానికులైన ఇద్దరు అభ్యర్థులు పోటీకి సిద్ధంగా ఉన్నామని, అధిష్టానం టికెట్ ఫైనల్ చేస్తే పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర వ్యవహారాలు చూసుకునే ఓ కీలక నేతతో ఇద్దరు అభ్యర్థులు ఎవరికి వారే మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం.


Similar News