ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి : జిల్లా కలెక్టర్

నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ

Update: 2024-05-26 12:28 GMT

దిశ,మహబూబాబాద్ టౌన్ : నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మే -27 న నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు కొనసాగుతుందని కలెక్టర్ అన్నారు. జిల్లాలోని పట్టభద్రుల ఓటర్లు వారి ఓటును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలా ఓటు వేయాలనే సమాచారాన్ని తెలిపే బ్యానర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రత్యేకమైన పెన్నును ఉపయోగించి ఓటు వేయాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఆదేశాలు కలవని ప్రతి ఒక్క పట్టభద్రుల ఎన్నికల నిబంధనలు పాటిస్తూ ఓటు వేయాల్సిందిగా పట్టభద్రుల ఓటర్లకు సూచించారు.

ఆదివారం రోజు ఫాతిమా హైస్కూల్ మహబూబాబాద్ నందు ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్ , అదనపు కలెక్టర్లు లోకల్ బాడీ, రెవెన్యూ లెనిన్ వత్సల్ టోప్పో, డేవిడ్ ల పర్యవేక్షణలో పోలింగ్ బ్యాలెట్ బాక్స్ లను డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి పోలింగ్ కేంద్రాలకు తరలించడం జరిగిందని అన్నారు.జిల్లాలో 18 మండల కేంద్రంలో 36 పోలింగ్ కేంద్రాలకు డివిజన్ కేంద్రాలైన మహబూబాబాద్ లోని ఫాతిమా హైస్కూల్, తొర్రూరు లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ద్వారా పోలింగ్ కేంద్రాలకు పంపిణీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి అని కలెక్టర్ అన్నారు.8 రూట్లలో 8 మంది సెక్టోరియల్ అధికారులను నియమించడం జరిగిందని,39 మంది ప్రిసైడింగ్ అధికారులు , ఏపీవోలు, ఓపిఓలు 137 మంది పోలింగ్ అధికారులు,40 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగింది.

డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ద్వారా పోలింగ్ స్టేషన్లు వారీగా పోలింగ్ మెటీరియల్స్ తో సహా పోలింగ్ బ్యాలెట్ బాక్సులను పోలీస్ బందోబస్తు తో పోలింగ్ అధికారులకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 34,933 కాగా అందులో 22,948 పురుషులుగాను 11 985 స్త్రీలు ఉన్నారని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో అలివేలు,మహబూబాబాద్ తహసీల్దార్ భగవాన్ రెడ్డి,మరియు పోలింగ్ అధికారులు సిబ్బందితో పాటు రెవెన్యూ యంత్రాంగం ఉన్నారు.

Similar News