హైదరాబాద్ ఎంపీ సెగ్మెంట్‌లో ట్రయాంగిల్ వార్.. పేలుతున్న మాటల తూటాలు!

లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల మద్య మాటల తూటాలు పేలుతున్నాయి.

Update: 2024-04-30 02:39 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో : లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల మద్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఫలానా పార్టీకి మీది బీ టీం అని ఒక పార్టీ నేత అంటే కాదు మీదే ఆ పార్టీకి బీ టీం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు . సాధారణంగా ఎన్నికలలో విమర్శలు, ఆరోపణలు సాధారణమే అయినప్పటికీ తాజా ఎన్నికలలో నాయకులు ఒక్క అడుగు ముందుకు వేసి విపరీత ధోరణిలో ప్రత్యర్థి పార్టీల మీద దుమ్మెత్తి పోస్తున్నారు . ఇది హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కువగా కనబడుతోంది. ఈ సెగ్మెంట్‌లో ప్రతి ఎన్నికల సందర్భంగా ఇతర పార్టీల నాయకులు ఎంఐఎం ఎలాంటి అభివృద్ధి చేయలేదని, సమస్యలు రాజ్యమేలుతున్నాయనే ఆరోపణలు చేస్తుంటారు.

ఎంఐఎంకు ఓటేస్తే ఇదే పరిస్థితి పునరావృతం అవుతుందని ఉపన్యాసాలు ఇస్తుంటారు. ఎన్నికలలో ఇవన్నీ సాధారణమైనప్పటికీ అభివృద్ధి విషయమై ఏ పార్టీ అభ్యర్థి కూడా మాట్లాడడం లేదు. సుమారు 40 సంవత్సరాలుగా పాతబస్తీలో ఎంఐఎం పార్టీ ఏకచ్ఛత్రాదిపత్యంగా రాజ్యమేలుతోంది. అటువంటి పార్టీని ఓడించాలంటే తాము గెలిస్తే ఏం చేస్తాం ? పాతబస్తీ అభివృద్ధికి తీసుకోబోయే ప్రణాళికలు ఏమిటనేది ప్రజలలోకి తీసుకువెళ్లాల్సింది పోయి అభివృద్ధి విషయాన్ని దూరం పెట్టి ఆరోపణలు చేసుకుంటుండం ఓటర్లు ఆసక్తిగా గమనిస్తున్నారు.

పార్టీల మద్య మాటల యుద్దం...

హైదరాబాద్ పార్టమెంట్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎంఐఎం జెండా తప్ప ఇతర పార్టీల జెండాలు గెలిచిన దాఖలాలు లేవు . ఒకవేళ కౌంటింగ్ లో కొన్ని రౌండ్లలో ముందంజలో ఉన్నప్పటికీ చివరికి వచ్చేసరికి ఎంఐఎంనే విజయం వరిస్తుండడం అందరికి తెలిసిందే. ఇలాంటి తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు తెచ్చి అభివృద్ధి ఎలా చేస్తామో చెప్పాల్సిన లీడర్లు అసలు విషయాన్ని మరుగున పెడుతున్నారని , ఎంఐఎంకు మీది బీటీం అని ఓ పార్టీ నేత అంటే , కాదు మీదే బీటీం అంటూ మరో నేత ఇలా ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. దీంతో ప్రజల కంటే ముందు లీడర్లు మారాలనే అభిప్రాయాలు వినబడుతున్నాయి .

ఆయన రూటే సపరేటు ...?

హైదరాబాద్ లోక్ సభ స్థానం నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నగడ్డం శ్రీనివాస్ యాదవ్ తీరు నియోజకవర్గం వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది . గత డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ టికెట్ కోసం ఈ నేత ఎంఐఎం అధినేత ను వేడుకున్నారు . ఎలాగైనా కేసీఆర్ కు చెప్పి టికెట్ కన్ఫామ్ చేయించాలని అసదుద్ధిన్ ఓవైసీని కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారాయి . అయితే తాజా పార్లమెంట్ ఎన్నికలలో ఇవన్నీ మరచిపోయి ఎంఐఎంపై విరుచుకుపడుతున్నారు.

ఇటీవల ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ అసదుద్ధీన్‌ను బంగాళా ఖాతంలో విసిరేయాలని అన్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి మాధవీలతను సైతం వదలలేదు. కోవిడ్ సమయంలో విరించి హాస్పిటల్‌లో రోగుల నుండి అధికంగా డబ్బులు వసూలు చేసి ధర్మం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు . ఇదిలా ఉండగా బీజేపీ అభ్యర్థి మాధవీలత సైతం ఎంఐఎం, బీఆర్ఎస్‌లపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు.

అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పరిగణలోకి కూడా తీసుకోకపోవడం, ఆ పార్టీ ప్రస్థావనే విమర్శలలో కనబడకపోవడం మూడు పార్టీల మద్యనే రాజకీయ వైరం ఉన్పట్లుగా పరిస్థితులు కనబడుతున్నాయి. రాజకీయంగా విమర్శించడం సాధారణమే అయినప్పటికీ గెలిస్తే ఎం చేస్తామో చెప్పకుండా, అభివృద్ధి విషయమై మాట్లాడకుండా వ్యక్తిగతంగా దూషణలకు దిగడం అంతటా చర్చనీయాంశంగా మారింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News